Friday, November 15, 2024

చెంచు చిన్నారులు, కిశోర బాలికల కోసం ‘గిరి పోషణ’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో చెంచు చిన్నారులు, కిశోర బాలికల సంక్షేమం, వారికి పౌష్టికాహారం అందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ “గిరి పోషణ” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెంచు చిన్నారులు, కిశోర బాలికల్లో ఎదుగుదల లోపాన్ని అధిగమించేందుకు అంగన్‌వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ మరింత సమర్థవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో బాల్యవివాహాలు పూర్తిగా తగ్గాయని, మారుమూల ప్రాంతాల్లో అధికారులతో మరింత అవగాహనా చర్యలు చేపట్టాలన్నారు.

ప్రజలు బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే తప్పిదాలు జరగవని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాఱలక్ష్మి పథకంతో బాల్యవివాహాలకు బ్రేక్ పడిందని అన్నారు. కళ్యాణలక్ష్మితో పేద ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ సెంటర్‌లలో పిల్లల హాజరు వందశాతం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు సైతం అంగన్‌వాడి కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం తినివెళ్లేవిధంగా వారికి అవగాహన కల్పించాలని కోరారు. వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లల విషయంలో బరువులు, ఎత్తులు సరిగ్గా ఉండేలా చూసి బరువు తక్కువ ఉన్న పిల్లలకు మరింత పటిష్టమైన పౌష్టికాహారాన్ని అందించే విధంగా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. అన్ని అంగన్‌వాడి కేంద్రాల్లో పరిశుభ్రత పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News