Sunday, December 22, 2024

తీహార్ జైల్లో గ్యాంగ్‌స్టర్ టిల్లు దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తీహార్ జైల్లో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియాను ప్రత్యర్థి గ్యాంగ్ హత్య చేసింది. మంగళవారం ఉదయం ఈ హత్య జరిగినట్లు జైలు అధికారులు వెల్లడించారు. హైసెక్యూరిటీ వార్డులో ఉన్న టిల్లుపై ప్రత్యర్థి గోగి గ్యాంగ్ సభ్యులు దాడి చేసి హతమార్చినట్లు తెలిపారు. నోటోరియస్ గోగీ గ్యాంగ్‌కు చెందిన నలుగురు టిల్లును కత్తిలా తయారుచేసిన ఆయుధాలతో 40నుంచి 50సార్లు పొడిచినట్లు అధికారులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న టిల్లును దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారని అధికారులు వివరించారు. నిందితులు దీపక్ అలియాస్ టిటర్, యోగేశ్ అలియాస్ తుండా, రాజేశ్, రియాజ్‌ఖాన్ నలుగురు బెడ్‌షీట్లు ఉపయోగించి మొదటి అంతస్తు నుంచి టిల్లు ఉన్న గ్రౌండ్‌ఫ్లోరులోకి మంగళవారం 6.15ప్రాంతంలో దాడి చేశారని అధికారులు వివరించారు. దాడికి ముందు మొదటి అంతస్తులోని ఐరన్‌గ్రిల్స్‌ను కత్తిరించి బెడ్‌షీట్ల సాయంతో కిందికి దిగినట్లు అనుమానిస్తున్నామన్నారు.

జైల్లో ఉన్న ఖైదీలను లెక్కించేందుకు సెల్ ఓపెన్ చేయగానే దాడికి పాల్పడ్డారు. నిందితులను చూడగానే టిల్లు మరో ఖైదీ రోహిత్ ఉన్న సెల్‌లోకి పరుగుతీసి గేటు మూసేందుకు ప్రయత్నించాడు. అయితే నిందితులు అడ్డుకుని దాడి చేయగా రోహిత్ కూడా గాయపడ్డాడని అధికారులు తెలిపారు. కేవలం రెండు నిమిషాల్లో మొత్తం దాడిని నిందితులు పూర్తి చేశారు. భద్రత సిబ్బంది నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన నిందితులును జైలు ఆసుపత్రిలో చికిత్స అందించి అనంతరం డిడియు ఆసుపత్రికి తరలించినట్లు జైలు అధికారులు వెల్లడించారు.

కాగా నెల రోజుల వ్యవధిలో తీహార్ జైలులో హత్య జరగడం ఇది రెండోసారి. ఏప్రిల్ 14న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహచరుడు ప్రిన్స్ తెవాతియా (33)ను ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యులు హత్య చేశారు. 2021సెప్టెంబరులో రోహిణి కోర్టులో గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి టిల్లు ప్రధాన నిందితుడు. గోగిని న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన ఇద్దరు నిందితులు తుపాకీతో కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు నిందితులు సంఘటన ప్రాంతంలోనే మరణించారు.

Also Read: పంజాబ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News