మన తెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నృసింహ జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే జయంతి మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు మంగళవారం ఉదయం ప్రధాన ఆలయంలో శాస్త్రోక్త పూజలతో ఆలయన అర్చక పండితులు మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వస్తివచనం, విఘ్నేశ్వర ఆరాధన, లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించిన అర్చకులు స్వామివారిని తిరువేంకటాపతిగా అలంకరించి వేదమంత్రాలు ఉచ్ఛరిస్తూ, మేళతాళాల మధ్య ఆలయ తిరువీధులలో ఊరేగించారు.
ఈ సందర్భంగా స్వామివారి క్షేత్రంలో నిర్వహించబడుతున్న నృసింహ జయంతి మహోత్సవ విశిష్టతను, అలంకార సేవ విశిష్టతను ఆలయ అర్చకులు భక్తకోటికి తెలియజేయగా, భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయంలో మృత్పంగ్రహణం, అంకురార్పణ, హవనం వేదోక్తం చేశారు. అనంతరం వాసుదేవ అలంకారంలో గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. జయంతి మహోత్సవాల్లో భక్తులు, స్థానికులు పాల్గొని స్వామివారి అలంకార సేవను దర్శించుకొని తరించారు. ఈ మహోత్సవ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఈవో గీత, ఆలయ అధికారులు భాస్కరశర్మ, రామ్మోహన్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
పాతగుట్టలో..
యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీపాతలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి మహోత్సవాలను వైభవంగా ప్రారంభించారు. ఆలయ అర్చకులు ఉదయం స్వస్తివచనం, పుణ్యవచనం, శాస్త్రోక్త పూజలతో ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ మహోత్సవ పూజలలో భక్తులు, స్థానికులు పాల్గొని దర్శించుకున్నారు.
ఉత్సవంలో నేడు..
నృసింహ జయంతి మహోత్సవాల్లో భాగంగా నేడు ఆలయంలో నిత్యమూలమంత్ర హవనములు, లక్ష పుష్పార్చన, కాళీయమర్ధన అలంకార సేవ, సాయంత్రం శ్రీరామావతార అలంకార సేవలను నిర్వహించనున్నట్టు అర్చకులు తెలిపారు.