న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లకు ఇండియన్ ఒలింఇక్ అసోసియేషన్(ఐఓఎ) అధ్యక్షురాలు పిటి ఉష మద్దతు ప్రకటించారు. బుధవారం జంతర్ మంతర్ చేరుకున్న పిటి ఉష అక్కడ నిరసన తెలుపుతున్న రెజ్లర్లను పరామర్శించారు.
తాను మొదట అథ్లెట్‌నని, ఆ తర్వాతే ఐఓఎ అధ్యక్షురాలినని పిటి ఉష అన్నారు. కాగా..రెజ్లర్ల నిరసన పట్ల పిటి ఉష మొదట్లో వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తమ సమస్యలను ఐఓఎకి తెలియచేయకుండా నేరుగా రోడ్డెక్కి నిరసన తెలియచేసినందుకు మహిళా రెజ్లర్లపై పిటి ఉష అంతకుముందు మండిపడ్డారు. రెజ్లర్లు కొంత క్రమశిక్షణను పాటించాలని, వీధులకెక్కి దేశ ప్రతిష్టను మంటగలిపారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బుధవారం జంతర్ మంతర్ వద్ద పిటి ఉష మీడియాకు ముఖం చాటేయడం గమనార్హం.
టోక్యో గేమ్స్‌లో కాంస్య పతక విజేత బజరంగ్ జంతర్ మంతర్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ పిటి ఉష రాక వివరాలు వెల్లడించారు. ఐఉఓఎ అధ్యక్షురాలి వ్యాఖ్యలు తొలుత తమను బాధించాయని, అయితే తన మాటలను వక్రీకరించారని ఆమె చెప్పుకొచ్చారని బజరంగ్ తెలిపారు. తాను మొదట అథెట్‌నని, ఆ తర్వాత పాలనాధికారినని ఆమె చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. తమకు న్యాయం కావాలని, ప్రభుత్వంతోకాని, ప్రతిపక్షంతోకాని తమకు గొడవల్లేవని, ఈ సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలన్నదే తమ డిమాండని పిటి ఉషకు చెప్పామని బజరంగ్ తెలిపారు. సిటి ఉష సమస్యకు పరిష్కారం ఏమైనా చూపారా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ చెప్పలేదని ఆయన తెలిపారు. మీతో నేనున్నాను అని మాత్రమే అన్నారని ఆయన చెప్పారు.