Friday, November 22, 2024

స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కమిటీ

- Advertisement -
- Advertisement -

సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ : స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధ గుర్తింపునివ్వడం గురించి మరింత లోతుగా వెళ్లకుండా స్వలింగ జంటలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల పరిష్కారానికి అమలు చేయవలసిన పాలనా పరమైన చర్యలను గుర్తించడానికి కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు బుధవారం తెలియజేసింది. దీని కోసం చాలా మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం అవసరమని వివరించింది. ఈ విషయంలో ఎలాంటి పాలనాపరమైన చర్యలు తీసుకోవచ్చునో పిటిషనర్లు సూచించవచ్చని కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధ గుర్తింపు కోరుతూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. స్వలింగ జంటలకు చట్టబద్ధ గుర్తింపు విషయంలో మరింత ముందుకు వెళ్లకుండా ఆ జంటలకు సాంఘిక సంక్షేమ ప్రయోజనాలు అందించడానికి అవకాశాలు కల్పించడం సాధ్యమౌతుందా ? అని ఏప్రిల్ 27న జరిగిన విచారణలో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.

ఈ జంటలు కలిసి జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దాని సాంఘిక పర్యవసానాలను గుర్తించవలసిన కర్తవ్యం ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీం కోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. స్వలింగ జంటల పెళ్లిళ్లకు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై బుధవారం ఏడో రోజు విచారణ జరిగింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్ , జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ హిమకోహ్లీ , జస్టిస్ పీఎస్ నరసింహ ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News