హైదరాబాద్ : ఆర్థికాభివృద్ధి, ప్రాంతీయాభివృద్ధికి బాటలు వేస్తూ రాష్ట్ర మంత్రులు, సీనియర్ ప్రభుత్వాధికారులు, జిఎంఆర్ గ్రూప్ ప్రముఖుల సమక్షంలో ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. 2203 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ విమానాశ్రయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విమానాశ్రయ డెవలపర్‌లలో ఒకటైన జిఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఈ విమానాశ్రయ నిర్మాణం దాదాపు 6 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యా పారాలు, పరిశ్రమల నుండి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. పర్యాటక అవకాశాలను సృష్టించి ఈ ప్రాంతపు సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది.
Also Read: 12 నుంచి పంట నష్టం సాయం
విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి భవిష్యత్తులో పెరిగే ప్రయాణీకుల అవసరాలను తీర్చిదిద్దడానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విమానాశ్రయం అభివృద్ధికి కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించగా దానిలో జిఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. తదనుగుణంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం రాయితీ ఒప్పందాన్ని అమలు చేశారు. రాయితీ ఒప్పందం ప్రకారం జిఎమ్‌ఆర్ సంస్థ మొదట 40 సంవత్సరాల పాటు విమానాశ్రయానికి డిజైన్ చేసి నిర్మించి, ఫైనాన్స్ చేసి నిర్వహిస్తుంది. ప్రాజెక్టు మొదటి దశ 3 సంవత్సరాలలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ప్రారంభంలో ఈ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది. విమానాశ్రయ సమీపంలో ఎగుమతులు, ఏరోట్రోపోలిస్, ఎయిర్‌పోర్ట్ సిటీ కోసం అత్యాధునిక కార్గో టెర్మినల్ ఉంటుంది.