హైదరాబాద్ : అకాల వర్షంతో దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లున్న టిజెఎస్ చీఫ్ కోదండరామ్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కోదండరామ్ సహా ఆ పార్టీ శ్రేణులను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలతో అన్నదాత బతుకు ఆగమైందన్నారు. తక్షణమే బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేవన్నారు.
ధాన్యం కొను గోలు కేంద్రాల్లో టార్పాలిన్లు ఉచితంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరగా పాత రుణాలిచ్చి కొత్త పంట రుణాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాగా, రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట దెబ్బతింది. రాష్ట్ర వ్యాప్తం గా పలు జిల్లాల్లో సుమారు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆయా జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులను ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నేతలు పరామర్శిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున చెల్లించనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.