Thursday, December 19, 2024

త్వరలో బిజెపిలోకి పొంగులేటి, జూపల్లి..!

- Advertisement -
- Advertisement -

త్వరలో బిజెపిలోకి పొంగులేటి, జూపల్లి!
వారిద్దరితో ఖమ్మంలో బిజెపి చేరికల కమిటీ భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్: ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు బిజెపిలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ నేతృత్వంలో సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, రవీందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌లు ఖమ్మంలో పొంగులేటితో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరితో సంప్రదింపులు జరిపారు. కర్ణాటక ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి పొంగులేటి… కేంద్ర హోం మంత్రి అమిత్ షా,జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో బిజెపిలో చేరతారని సమాచారం.

ఉమ్మడి ఖమ్మంపై బిజెపి ప్రత్యేక దృష్టి..
రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. బిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకొనేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బిఆర్‌ఎస్ బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కమలం గూటికి రప్పించేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది. రెండు జాతీయ పార్టీల ముఖ్యనేతలు తనను సంప్రదిస్తున్నారంటూ మాజీ ఎంపి పలుమార్లు వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్‌ను మూడోసారి అధికారంలోకి రానివ్వకుండా.. కెసిఆర్ సిఎం కాకుండా చేసే పార్టీలోకే వెళ్తానని ఆయన ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించి బిఆర్‌ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని ఆయన శపథం చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఖమ్మం నగరంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి సన్నద్ధమవుతున్నారు. ఈలోగా బిజెపి ముఖ్యనేతలు పొంగులేటితో భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చల్లో పొంగులేటి గతంలోనే ప్రకటించిన ఇల్లందు అభ్యర్థి కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా అభ్యర్థిగా ప్రకటించిన విజయాబాయిని పాల్గొన్నారు.

సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం: ఈటల
మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో దాదాపు ఐదు గంటల పాటు సాగిన భేటీ అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. వారిది.. మాది లక్ష్యం ఒక్కటే. పొంగులేటి, జూపల్లి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కుటుంబ పాలన అంతమొందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని వాగ్దానం నెరవేర్చే బాధ్యత అమిత్ షా, జెపి నడ్డాపై ఉంది. నడ్డా ఆదేశాలతోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్ల్లి కృష్ణారావును కలిశాం. పొంగులేటికి ఒకటే చెప్పాం. ఈ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ నిరంకుశ పాలనను బొందపెట్టగలిగే పార్టీ బిజెపి మాత్రమే. పార్టీలో చేరాలని కోరాం. అందరం కలిసికట్టుగా మన లక్ష్యాన్ని, ప్రజల ఆశయాన్ని నెరవేర్చిన వాళ్ల మవుతామని చెప్పాం. మా ఆశయం, వారి ఆశయం ఒకటే కాబట్టి కచ్చితంగా పొంగులేటి సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాం.

బిఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యం: పొంగులేటి, జూపల్లి
బిజెపి ముఖ్యనేతలతో భేటీ అనంతరం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రమొస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని కలలు కన్న తెలంగాణ బిడ్డల ఆశయాన్ని సిఎం కెసిఆర్ తుంగలో తొక్కారు. వ్యక్తిగత స్వార్థం కోసం పరిపాలన చేస్తున్న బిఆర్‌ఎస్‌ను గద్దె దించే అంశంలో అందరం ఏకం కావాలి. ఇదే విషయాన్ని అనేక వేదికలపై చెప్పాను ప్రజల ఆశయం నెరవేర్చే క్రమంలోనే ఈ నాటి సమావేశం, భవిష్యత్‌లో జరగబోయే సమావేశాలు, కెసిఆర్‌ను గద్దె దించడమే మా అందరి లక్ష్యం. తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి‘ అని పొంగులేటి తెలిపారు.‘అమరవీరుల ఆత్మలు శాంతించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం దక్కకుండా చూడాలి. దానికి ఉన్న మార్గాలను చెప్పాం.. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఓటు చీలకుండా ప్రయత్నిస్తాం. ప్రజలంతా సంఘటితం కావాలి‘ అని జూపల్లి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News