భోపాల్ : మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో దారుణం జరిగింది. రెండు కుటుంబాల మధ్య నెలకొన్న భూ వివాదాలు ఆరుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. మొరెనా జిల్లాలోని లీపా గ్రామానికి చెందిన ధీర్ సింగ్ తోమర్, గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబాల మధ్య గతంలో భూ వివాదాలు ఉన్నాయి. 2013లో ధీర్ సింగ్ కుటుంబానికి చెందిన ఇద్దరిని గజేంద్ర సింగ్ కుటుంబ సభ్యులు చంపారు. అనంతరం గజేంద్ర సింగ్ ఆ ఊరును వదిలి వెళ్లిపోయింది. అయితే ఇటీవలే ఇరు కుటుంబాలు కోర్టు బయట రాజీ కుదుర్చుకున్నాయి. దీంతో గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబం తిరిగి సొంతూరుకు చేరుకుంది.
Also Read: కశ్మీర్ లో ఉగ్ర పంజా..ఐదుగురు జవాన్లు మృతి
గ్రామానికి చేరుకున్న గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబ సభ్యులపై ఇవాళ ఉదయం 10 గంటలకు కర్రలతో దాడి చేశారు ధీర్ సింగ్ తోమర్ కుటుంబ సభ్యులు. అనంతరం వారిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గజేంద్ర సింగ్, ఆయన ఇద్దరు కుమారులు, మరో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పోలీసులు లీపా గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో 8 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.