Thursday, October 24, 2024

పసుపు పారాణీ ఆరక ముందే..

- Advertisement -
- Advertisement -

డార్జిలింగ్ : పెళ్లి పసుపు పచ్చదనం ఆరక ముందే, మధుర స్మతులు మరువక ముదే అకస్మాత్తుగా ఆ యువజవాన్ ఉగ్రవాదుల బాంబు దాడులకు నేల కొరిగాడు. కట్టుకున్న భార్యకు , తల్లిదండ్రులకు, సోదరునికి తీరని ఆవేదన మిగిలించి మరలిరాని లోకానికి త్వరగా వెళ్లి పోయాడు. జమ్ముకశ్మీర్ లోని రాజౌరీలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన యువ జవాన్ సిద్ధాంత్ చెట్రీ తనకు పెళ్లై రెండు నెలలు దాటక ముందే మధురమైన వివాహ జీవితానికి విషాద తెరలను దించి తీరని ఆవేదన మిగిలించాడు. 24 ఏళ్ల సిద్ధాంత్ పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లా బిజంబరికి చెందిన వాడు. ఆయన పెద్దన్నయ్య ఓం ప్రకాష్ చెట్రీ కూడా ఆర్మీలో పనిచేసి ఇటీవలనే రిటైరయ్యారు.

“ తమ్ముడు సిద్ధాంత్‌కు దేశ సేవంటే అపారమైన మక్కువ. అందుకనే 2020లో ఆర్మీలో చేరాడు. ఆయన చక్కని సమర్ధత వల్ల స్పెషల్ ఫోర్సులో చేరగలిగాడు. రెండు నెలల క్రితమే పెళ్లయింది. జమ్ము కశ్మీర్‌లో తన డ్యూటీలో వెంటనే చేరాడు. డ్యూటీలో చేరిన 15 రోజులకే అమరత్వం పొందాడు ” అని ఆయన పెద్దన్నయ్య ఓం ప్రకాష్ కంటతడి పెట్టుకున్నారు. తన చిన్న తమ్ముడి భౌతిక కాయాన్ని తీసుకురాడానికి బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి వెళ్తూ ఫోన్ ద్వారా పిటిఐకి తెలియజేశారు. రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన ఐదుగురు జవాన్లలో సిద్ధాంత్ ఒకరు. “ ఆయన చాలా యువకుడు. కేవలం 24 ఏళ్లే. భార్య వయసు 22 ఏళ్లే. భర్త మరణించాడన్న విషాద వార్త విన్న తరువాత ఆమె తరుచుగా స్పృహ కోల్పోతున్నారు.

మా అమ్మానాన్నలైతే మూగబోయి ఏమీ మాట్లాడలేక పోతున్నారు” అని ఓం ప్రకాష్ బాధపడ్డారు. జమ్ము నుంచి స్పెషల్ విమానంలో సిద్దాంత్ భౌతిక కాయం బాగ్ డోగ్రా విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా బాంగ్‌డుబీ ఆర్మీ స్థావరానికి చేర్చారు. అక్కడ మిలిటరీగౌరవ మర్యాదలు జరిగాయి.సీనియర్ ఆఫీసర్లు సిలిగురి మెట్రోపోలీస్, జిల్లా అధికారులు, నివాళులు అర్పించారు. స్థానిక బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ శంకర్ ఘోష్ , కల్నల్ అంజన్ కుమార్ బసుమటరి తదితర ఆర్మీ సీనియర్ ఆఫీసర్లు అంతిమ వీడ్కోలు పలికారు. అక్కడ నుంచి బిజంబరి లోని కిజోంబస్తీలో గల ఇంటికి సిద్ధాంత్ భౌతిక కాయం చేరుకుంది. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్ర సంతాపం తెలిపారు. ఉగ్రవాదుల నిర్మూలనలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల త్యాగాలు ఎన్నడూ మరువరానివని ఆమె నివాళి అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News