మన తెలంగాణ/హైదరాబాద్: కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్దికోసం ప్రధాని నరేంద్ర మోడి ‘ది కేరళ స్టోరీ’ని ఉపయోగించుకుంటున్నారని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి ఆరోపించారు. మోడిపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఆయన ట్వీట్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాని మోడి ‘ది కేరళ స్టోరి’ చిత్రంపై ఆధారపడాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు. అసత్యాలు, తప్పుడు ప్రచారాలతో తీసిన ది కేరళ స్టోరీ సినిమాను ఆశ్రయించాల్సిన కర్మ బిజెపికి, ప్రధాని మోడికి పట్టిందని దుయ్యబట్టారు.
ఈ మేరకు ప్రధాని మాట్లాడుతున్న వీడియోను అసదుద్దీన్ షేర్ చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఓవైసి జమ్ముకశ్మీర్‌లో మన సైనికులు చనిపోతుంటే, మణిపూర్ తగలబడిపోతుంటే ప్రధానికి మోడికి ఇవేమి పట్టవని తన ఎన్నికల ప్రచార సభల్లో రోడ్ షోలలో ఓవైసి తూర్పారబడుతున్నారు. ఉగ్రదాడిలో ఐదు గురు సైనికులు చనిపోయారని, మణిపూర్‌లో హింస చలరేగి గ్రామాలు తగలబడుతున్నాయని ప్రధాని మాత్రం కల్పిత చిత్రం గురించి మాట్లాడటం విచారకరమని మండిపడ్డారు.