న్యూఢిల్లీ : ఆఫ్రికా లోని కాంగోలో కురిసిన భారీ వర్షాలకు దక్షిణ ప్రావిన్స్ లోని కలేహేలో నదలు ఉప్పొంగి, వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలకు కొండచరియలు విరిగి పడడంతో మృతుల సంఖ్య 203 కి చేరింది. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా కలేహాలో నదులు ఉప్పొంగాయి వరదల బీభత్సానికి కొండచరియలు విరిగి పడడంతో దాదాపు 200 మందికి పైగా మృతి చెందారు. మరి కొందరు గల్లంతయ్యారు. ఇప్పటికే అధికారులు 203 మృతదేహాలను గుర్తించి తొలగించడమైందని కలేహే ప్రావిన్స్ అడ్మినిస్ట్రేటర్ థామస్ బకెంగా వెల్లడించారు. గురువారం కలేహే ప్రాంతంలో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి వరదలు ముంచుకొచ్చాయని చెప్పారు. న్యాయముకుబిలో ప్రతి గురువారం వారం సంత జరగడం పరిపాటి.
Also Read: ఆస్తి పంచలేదని తల్లి మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచిన కూతుళ్లు
అలాగే గురువారం నాడు సంత జరుగుతుండగా కొండచరియలు విరిగి పడ్డాయని తెలిపారు.అనేక గ్రామాలు వరద నీటిలో మునిగాయి. చాలా ఇళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. పంటపొలాలు దెబ్బతిన్నాయి. వరద బాధిత ప్రాంతానికి అత్యవసర వైద్యసాయం కోసం సర్జన్లు, ఎనస్తీషియన్లను, టెక్నీషియన్లను శనివారం పంపామని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత బెనిస్ ముక్వేగె చెప్పారు.తరచుగా వరదలకు , కొండచరియల ముప్పుకు గురయ్యే దక్షిణ కివులో భారీ వర్షాలకు వరదలు , కొండచరియలు విరిగిపడ్డాయి. రువాండాలో ఈ వారం భారీ వర్షాలకు , కొండచరియలు విరిగిపడి దాదాపు 130 మంది వరకు మృతి చెందారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. భూతాపాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోని దేశాలకు ఈ వినాశనం ఒక ఉదాహరణగా ఆయన ఆవేదన వెలిబుచ్చారు. 2014 లో ఇదే విధంగా కాంగోలో ప్రకృతి విపత్తు సంభవించి 700 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పుడు 130 మంది గల్లంతయ్యారు.