Monday, December 23, 2024

గుజరాత్‌దే గెలుపు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సూపర్ విక్టరీ సాధించింది. పరుగుల ప్రవాహంలా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జియాంట్స్‌ను చిత్తు చేసింది. గుజరాత్ నిర్దేశించిన 228 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో జట్టు ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. గుజరాత్ జట్టు 56 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. మొదట్లో కైల్ మేయర్స్, డీకాక్ శుభారంభాన్నే అందించారు కానీ.. ఆ తర్వాత లక్నో జట్టు పూర్తిగా పట్టు కోల్పోయింది. ఇతర ఆటగాళ్లెవ్వరూ నిలకడగా రాణించలేకపోయారు. కైల్ మేయర్స్ ఔట్ అవ్వగానే.. మిగతా ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. స్టార్ ఆటగాళ్లు సైతం చేతులు ఎత్తేయడంతో.. లక్నో జట్టుకి ఓటమి తప్పలేదు.

శుభారంభం..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా (81), శుభ్మన్ గిల్ (94 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో.. జీటీ అంత భారీ స్కోరు చేయగలిగింది. హార్దిక్ (25), మిల్లర్ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. తమ జట్టుకు తమవంతు సహకారం అందించారు. అనంతరం 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు.. నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితం అయ్యిం ది. మొదట్లో ఓపెనర్లు కైల్ మేయర్స్, డీకాక్ తమ జట్టుకి శుభారంభాన్నే అందించారు. పవర్ ప్లేలో ఇద్దరు కలిసి దంచికొట్టారు. 10కి పైగా రన్ రేట్‌తో పరుగుల సునామీ సృష్టించారు. కానీ.. ఎప్పుడైతే కైల్ మేయర్స్ ఔట్ అయ్యాడో, అప్పటి నుంచి లక్నో పతనం మొదలైంది. మైల్ మేయర్స్ పోయిన తర్వాత, ఏ ఒక్క ఆటగాడు కూడా నిలకడగా రాణించలేదు. ఇలా క్రీజులో అడుగుపెట్టినట్టే పెట్టి, వరుసగా పెవిలియన్ బాట పట్టారు.

డీకాక్ ఒంటరి పోరాటం

కివంటాన్ డీకాక్ గుజరాత్ బౌలర్లను ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం సాగించాడు కానీ.. ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందకపోవడంతో, అతడూ నీరసించిపోయాడు. స్టోయినిస్, పూరన్ వంటి స్టార్ ఆటగాళ్లు సైతం చేతులెత్తేశారు. మధ్యలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన బదోని ఒక్కడే.. రెండు సిక్సులు, ఒక ఫోర్‌తో కాస్త మెరుపులు మెరిపించాడంతే. కెప్టెన్ కృనాల్ పాండ్యా అయితే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇలా ప్రధాన బ్యాటర్లందరూ హ్యాండ్ ఇవ్వడంతో.. లక్నో 56 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. నూర్ అహ్మద్, షమీ, రషీద్ ఖాన్ తలా వికెట్ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News