ధోల్‌పూర్: 2020లో తన ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు వసుంధర రాజే సహా ముగ్గురు బిజెపి నాయకులు తనకు సాయపడ్డారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవల అనడాన్ని వసుంధర రాజే ఖండించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని, రాష్ట్ర కాంగ్రెస్ శాఖలో తిరుగుబాటుతో ఆయన రగిలిపోతున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయని వసుంధర రాజే అన్నారు.
‘నాపై గెహ్లాట్ చేసిన ప్రకటన ఓ కుట్ర. గెహ్లాట్ అవమానించినంతగా నన్నెవరూ అవమానించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అబద్ధాలు చెబుతున్నారు. సొంత పార్టీలోని తిరుగుబాటు కారణంగా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని వసుంధర రాజే తెలిపారు.
ధోల్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన గెహ్లాట్ 2020 సంక్షోభాన్ని బిజెపి ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు కుట్ర పన్నారని, వసుంధర రాజే, మాజీ అసెంబ్లీ స్పీకర్ కైలాశ్ మేఘవాల్, ఎంఎల్‌ఏ శోభారాణి కుష్వాహా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అనుకూలంగా వ్యవహరించలేదని అన్నారు. అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్ర షెకావత్ డబ్బులు పంచి కుట్రపన్నారని, ఎంఎల్‌ఏలకు డబ్బులిచ్చి తిరుగుబాటును ప్రోత్సాహించారని, వారు 25 ఎంఎల్‌ఏలను తమ వైపుకు తిప్పుకున్నారని, అమిత్ షా చాలా ప్రమాదకర గేమ్ ఆడారని గెహ్లాట్ తెలిపారు. 2020లో గెహ్లాట్‌కు,పైలట్‌కు మధ్య రచ్చ రగులుకుంది. పైలట్‌ను ఉపముఖ్యమంత్రి, స్టేట్ యూనిట్ చీఫ్ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత పైలట్ ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీ పడ్డారు.