చెన్నై: ది కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శనను మే 7వ తేదీ నుంచి పూర్తిగా నిలిపివేస్తున్న తమిళనాడు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ వివాదాస్పద చిత్రం ప్రదర్శనను రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నామ్ తమిళర్ కట్చి(ఎన్‌టికె) నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అసోసియేషన్ తెలిపింది. మల్టీప్లెక్సులలో ఇప్పటికే ప్రకటించిన స్కీనింగ్స్‌ను సంఘం రద్దుచేసింది. మే 5వ తేదీన విడుదలైన ఈ చిత్రంపై కేరళ, తమిళనాడులో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేరళకు చెందిన వేలాదిమంది హిందూ మహిళలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి వారిని ఉగ్రవాద సంస్థైఎస్‌ఐఎస్‌లో నియమించినట్లు ఈ చిత్రంలో చూపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Also Read: బెంగళూరు బస్సులో రాహుల్ ఎన్నికల ప్రచారం
కేరళ స్టోరీ చిత్రాన్ని పవరర్శించడంపై తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు, వెల్లూరు, పాండిచ్చేరిలో ఎన్‌టికె పార్టీ సభ్యులు మే 6వ తేదీన నిరసనలు నిర్వహించారు. ముస్లింలను కించపరిచి వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరించడానికే ఈ చిత్రం తీశారని ఎన్‌టికె నాయకుడు సీమాన్ మండిపడ్డారు. తమిళనాడు వ్యాప్తంగా ఎన్‌టికె సభ్యులు ఈ సినిమా టిక్కెట్ కొని థియేటర్‌లోకి వెళ్లి సినిమా ప్రదర్శనిస్తున్న వేళ నిరసనలు తెలియచేస్తారని ఆయన హెచ్చరించారు. చెప్పినట్లుగానే ఎన్‌టికె సభ్యులు పాండిచ్చేరిలో చేశారు. కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న తియేటర్‌లోకి టిక్కెట్లు కొని ప్రవేశించిన ఎన్‌టికె సభ్యులు సినిమా స్క్రీనింగ్ జరుగుతున్నంతసేపు నినాదాలు చేస్తూ తమ పార్టీ పతాకాలతో నిరసన తెలియచేశారు.
కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శన నిలిపివేయాలన్న తమిళనాడు మల్టీప్లెక్స్ అసోసియేషన్ నిర్ణయం అమలు అవుతున్నట్లు తిరుపూర్‌లోని ఒక థియేటర్ యజమాని వెల్లడించారు. శుక్రవారం, శనివారం కొన్ని షోలు వేసినప్పటికీ ఆదివారం నుంచి చిత్ర ప్రదర్శన పూర్తిగా నిలిపివేసినట్లు ఆయన చెప్పారు. సినిమాలో పెద్ద తారాగణం లేదని, ప్రేక్షకుల నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోవడంలేదని ఆయన చెప్పారు. మదురైలో కూడా చిత్ర ప్రదర్శన నిలిపివేసినట్లు అక్కడి థియేటర్ యజమాని ఒకరు తెలిపారు. ఈ చిత్రాన్ని ఏ పంపిణీదారుడు కొనలేదని, ఈ కారణంగా చిత్ర ప్రదర్శనపై తమపై ఎటువంటి ఒత్తిడి లేదని ఆయన వెల్లడించారు.