Sunday, November 24, 2024

అవినీతికి అవిభక్త కవలలు మోదానీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్ట్‌లు వస్తున్నారు

కాంగ్రెస్ మోసకారి.. బిజెపికి మతపిచ్చి

కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు లేదు.. రైతుబీమా లేదు 
ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా?

ఈ పార్టీల నేతల మాయలో పడొద్దు

బెల్లంపల్లిలో 7వేల ఇళ్ల పట్టాల పంపిణీ
350 ఎకరాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు

త్వరలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు

బెల్లంపల్లి అభివృద్ధికి రూ.50కోట్లు బెల్లంపల్లి సభలో కెటిఆర్

మన తెలంగాణ/బెల్లంపల్లి టౌన్/పెద్దపల్లి/గోదా వరిఖని: అవినీతికి అవిభక్త కవలలు ప్రధానీ, అదానీ అని ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తీ వ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలను కష్టాల్లోకి నెట్టి దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారని, వారి మాయ మాటలు నమ్మొద్దని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెంటిలేటర్‌పై ఉందని, బిజెపి మతపిచ్చితో ప్రజలను రెచ్చ గొట్టి పబ్బం గడుపుకుంటుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని మంచి నాయకుడిని వదులుకోవద్దని సిఎం కెసిఆర్‌ను ముచ్చటగా మూడోసారి ముఖ్య మంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. సోమవారం బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్య క్రమాలకు శంకుస్థాపన చేసిన కెటిఆర్, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

ప్రపంచంతోనే పోటీపడే విధంగా తెలంగాణను అ భివృద్ధి చేస్తామన్నారు. రూ.20వేల కోట్లతో రోడ్లకు భూమి పూజ చేసుకున్నామని, త్వరలోనే బెల్లంపల్లి నియోజకవర్గంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఐటీ రంగంలోనే ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. బెల్లంపల్లి పట్టణంలో నిరుపేదలకు 7వేల మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చేయని విధంగా ఇక్కడ పట్టాలు పంపిణీ చేశామన్నారు. బెల్లంపల్లిలో 47 వేల మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయని, 350 ఎకరాల్లో ఆహార శుద్ధి పరిశ్రమల కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, 27 కంపెనీలకు ఈ స్థలాన్ని కేటాయిస్తున్నామని కెటిఆర్ తెలిపారు.

గతంలో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, రూ. 44 కోట్లతో మిషన్ భగీరథను ప్రారంభించి నీటి కష్టాలను దూరం చేశామన్నారు. గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన నేతలు మాటలు చెప్పారని ఎక్కడా పనులు చేయలేదని కానీ బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో చెప్పని పనులు కూడా చేసి చూసిప్తుందన్నారు. రూ. 20 కోట్లతో రోడ్లు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని ఈ పనులకు ఈ రోజు శంకుస్థాపనలు చేసుకోవడం శుభపరిణామని బెల్లంపల్లి అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం మీదని మీరు ఆశీర్వదించారు కాబట్టే రెండుసార్లు అధికారంలోకి వచ్చి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారని కెటిఆర్ పేర్కొన్నారు.

దేశంలో 75ఏళ్ల పాలనలో ఏ ప్రధాన మంత్రి, ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా సిఎం కెసిఆర్ రైతుల గురించి ఆలోచించి రైతు బంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. దళితబంధు విషయంలో ఏ ఎక్కరికీ రూపాయి కూడా ఇవ్వవద్దని ఆయన సూచించారు. దళిత బంధుతో దళితుల జీవితాలు ఆర్థికంగా బలపడి పూర్తిగా మారిపోతాయన్నారు. అదే విధంగా సింగరేణిలో 15వేల మందికి కారుణ్య నియామకాలు చేసుకున్నామని అది కెసిఆర్ వల్లే సాధ్యమైందన్నారు. ఆనాటి ప్రభుత్వాలు సింగరేణి బిడ్డల గురించి ఆలోచన చేయలేదని కానీ కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత సింగరేణి కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయన్నారు. 4,027 కొత్త ఉద్యోగాలు ఇచ్చామని, గత ప్రభుత్వం కర్కషంగా 540 మంది కార్మికులను తొలగిస్తే వారికి తిరిగి పనిలో పెట్టుకున్న మంచి మనస్సు ఉన్న వ్యక్తి సిఎం కెసిఆర్ అని అన్నారు. పదవీ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంచుకున్నామని, లాభాల బోనస్‌ను 18శాతం నుంచి 30 శాతానికి పెంచుకున్నామని కెటిఆర్ పేర్కొన్నారు.

కార్మికులు ఇండ్లు నిర్మించుకుంటే వడ్డీ లేకుండా రూ. 10 లక్షలు ఇస్తున్నా ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మాటలకు ఆగం కావొద్దని, సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందన్నారు. పక్కన ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వలేకపోతున్నాయి. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజలను మాయ చేయటానికి ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడని దేశంలో 55 ఏళ్లు పాలించిందని కాంగ్రెస్సేనని మరీ అప్పుడు ఎందుకు ప్రజల సంక్షేమం పట్టలేదన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో కరెంటు కష్టాలు తాండవించాయని కానీ సిఎం కెసిఆర్ పాలనాదక్షతతో వాటిన్నంటినీ పటాపంచలు చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్నారు. కెసిఆర్ పాలన చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. కానీ అది సాధ్యమయ్యే పని కానీ ఆయన చెప్పారు.

అదే విధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని అక్కడ ఎకరానికి 12 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుందన్నారు. అక్కడ రైతు బీమా లేదు, రైతు బంధు లేదు ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా అని కెటిఆర్ ప్రశ్నించారు. 55 ఏండ్లు పాలన సాగించి దగా చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెంటిలేటర్ ఉందని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుందని దానిని బతికించకపోగా ఆ నాయకులే తన్నుకుంటున్నారన్నారు. ఇక బిజెపి మతపిచ్చితో ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడపటానికి చూస్తుందని ఇలాంటి పార్టీలకు ఓటు వేసి ఓటును వృథా చేసుకోవద్దని ప్రజలకు కెటిఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహ్మద్‌అలీ, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, ఎంపీ వెంకటేష్‌నేత, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ప్రవీణ్ పాల్గొన్నారు.

బెస్ట్ పోలీసింగ్ అంటేనే తెలంగాణ
తెలంగాణ పోలీస్ అంటేనే దేశంలో నెంబర్ వన్ పోలీస్ వ్యవస్థగా ఏర్పడిందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు. గోదావరిఖనిలో నూతనంగా నిర్మించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ భవన ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. టెక్నాలజీని వినియోగించడంలో, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో, పారదర్శకంగా వ్యవహరించడంలో, అత్యుత్తమ వాహనాలు, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ వినియోగించడంలో, పోలీస్ సంక్షేమం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతుందని అన్నారు.

బెస్ట్ పోలీసింగ్ అంటేనే తెలంగాణ వైపు దేశంలోని అన్ని రాష్ట్రాలు చూడటం మనకెంతో గర్వకారణమని అన్నారు. సూక్ష్మంగా ఆలోచించే నాయకత్వం తెలంగాణకు ముఖ్యమంత్రి కెసిఆర్ రూపంలో ఉందని అన్నారు. పరిపాలించే వారికి సంకల్ప శుద్ధి, చిత్తశుద్ది, వాక్ శుద్ధి ఉంటేనే పనులు జరుగుతాయని, గత పాలకులకు అవిలేకనే పనులు జరుగలేదని, ముఖ్యమంత్రి కెసిఆర్‌లో అవన్ని ఉండటంతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయని చెప్పారు. అమెరికా దేశం తరహాలో తెలంగాణలో కూడా ఎఫెక్టీవ్ పోలీసింగ్ విధానాన్ని అమలు పరచాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ డిజిపి అంజనీ కుమార్‌కు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News