నేడు వాయుగుండం..
17 జిల్లాలకు ఎల్లో అలర్ట్
మరో రెండు రోజులు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడి ముద్ర మట్టం నుండి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకూ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం బలపడి మంగళవారం వాయుగుండంగా అదే ప్రదేశంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ వాయుగుండం బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ నెల 11వ తేదివరకూ దాదాపు ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు కదిలే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఆ తరువాత క్రమంగా దిశను మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్టు విరించింది. మంగళవారం నుండి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి రాష్ట్రంలోని కొన్ని చోట్ల సుమారు 40నుండి 43డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
17జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
దిగవ స్థాయిలోని గాలులు దక్షిణ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్న నేపధ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో రైతులకు ప్రత్యేక వాతారణ హెచ్చరిక చేసింది. మరో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 24గంటల్లో తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.