హైదరాబాద్: అమెరికాలోని టెక్సాస్ మాల్ కాల్పుల ఘటనలో మరణించిన హైదరాబాద్ యువతి ఐశ్వర్య తాటికొండ మృతదేహం త్వరలో భారత్ రానున్నది. టెక్సాస్‌లోని అల్లెన్ ప్రీమియం ఔట్‌లెట్స్ మాల్‌లో మే 6న జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 9 మందిలో ఐశ్వర్య ఒకరు. టెక్సాస్‌లోని మెక్‌కిన్నీ లో పనిచేసిన ఐశ్వర్య తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. 27 ఏళ్ల ఐశ్వర్య రెండేళ్లుగా డల్లాస్‌లో పనిచేస్తున్నట్లు ఆమె లింక్డ్ ప్రొఫైల్ చెబుతోంది.
ఆమె తండ్రి తాటికొండ నర్సిరెడ్డి అదనపు జిల్లా జడ్జిగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కమర్షియల్ కోర్టు కాంప్లెక్స్‌లో పనిచేస్తున్నారు. టెక్సా మాల్‌లో కాల్పులు జరిగినపుడు ఆమె తన మిత్రులతో కలసి షాపింగ్ చేస్తున్నారు. గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పులలో తొమ్మిదిమంది మరణించారు. శనివారం సాయంత్రం 3.30 గంటలకు జరిగిన ఈ సంఘటనతో షాపింప్ కోసం మాల్‌కు వచ్చిన పౌరులు భయాందోళనతో పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం.
కాల్పుల సంఘటనపై స్పందించిన హూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఘటనలో మృతిచెందిన ఐశ్వర్య తాటికొండ కుటుంబానికి సంతాపం తెలియచేసింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైన సహాయం సంపూర్ణంగా అందచేస్తామని తెలిపింది.