వీడియో సందేశంలో కన్నడ ప్రజలకు మోడీ భరోసా
న్యూఢిల్లీ : మీ కలలే నా కలలు.. మీ తీర్మానమే నా తీర్మానం అని ప్రధాని నరేంద్రమోడీ బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కర్ణాటక ప్రజలకు భరోసా ఇచ్చారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత కన్నడ ప్రజలను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని ప్రసారం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కర్ణాటక ఐదవ స్థానంలో ఉందని, త్వరలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటక ఆర్థిక వ్యవస్థ శ్రీఘ్రగతిని అభివృద్ధి చెందితేనే ఇది సాధ్యమౌతుందన్నారు. కర్ణాటక ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమని కితాబు ఇచ్చారు.
కరోనా విపత్కాలంలో కూడా కర్నాటక బీజేపీ ప్రభుత్వ నాయకత్వంలో ఏడాదిలో 90 వేల కోట్ల పెట్టుబడులు చూశామని గత ప్రభుత్వాల అజమాయిషీలో కర్ణాటక విదేశీ పెట్టుబడులు ఏడాదికి కేవలం రూ. 30 వేల కోట్లు మాత్రమే వచ్చేవని చెప్పారు. కర్ణాటక నగర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం, గ్రామాలు, పట్టణాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం, మహిళలు, యువకులకు కొత్త అవకాశాలు కల్పించడం తదితర అభివృద్ధికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు.
పెట్టుబడులు, పరిశ్రమలు, నూతన ఆవిష్కరణల్లో కర్ణాటకను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చి దిద్దాలని తాను కోరుకుంటున్నట్టు ప్రధాని తెలిపారు. వ్యవసాయ రంగంలోనూ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేలా బీజేపీ ప్రయత్నిస్తుందని, కర్ణాటక సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తుందని చెప్పారు. నెంబర్ 1 రాష్ట్రంగా కర్ణాటక నిలపాలంటే 10 న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన పౌరులుగా ఓటు వేయాలని మోడీ పిలుపునిచ్చారు.
My message to the people of Karnataka… pic.twitter.com/DvFGl952OV
— Narendra Modi (@narendramodi) May 9, 2023