మన తెలంగాణ/హైదరాబాద్: భాగ్యనగరంలో మరోమారు ఉగ్ర కలకలం చోటు చేసుకుంది. నగరంలో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలు 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కచ్చితమైన సమాచారంతో కొంతకాలంగా నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం మధ్యప్రదేశ్ పోలీసులతో కలిసి సిటీలో సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. పలుచోట్ల సోదాలు జరిపి భోపాల్ కు చెందిన 11 మందితో పాటు హైదరాబాద్‌కు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. హైద్రాబాద్ కు చెందినవారు ఉన్నత విద్యావంతులు. పాతబస్తీలో డెంటిస్ట్‌గా పని చేస్తోన్న షేక్ జునైద్, మెడికల్ కాలేజ్ హెచ్వోడీ మహ్మద్ సలీం, ఇంజనీర్ అబ్దుల్ రెహ్మన్, రోజువారి కూలీ అమీద్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇక, పరారీలో ఉన్న కీలక నిందితుడు సల్మాన్ కోసం మధ్యప్రదేశ్ ఎటిఎస్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. కాగా, వీరందరికి ఉగ్రవాద సంస్థ హిజాబ్ ఉత్ తహ్రీల్ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మంగళవారం ఉదయం నుంచి కొనసాగుతున్న సోదాలలో కత్తులు, డాగర్లు, ఇస్లామిక్ జిహాద్ సాహిత్యం, సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు వివరించారు. నిందితులు ఉంటున్న ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇస్లామిక్ రాడికల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భోపాల్‌కు చెందిన నిందితులపై అక్కడి పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. 16మంది నిందితులను భోపాల్‌కు తరలించారు.
యువతను సైతం ఇస్లామిక్ రాడికల్స్‌గా మార్చేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్లను ప్రశ్నించడం ద్వారా ఏదైనా కుట్ర పన్నారా అనే వివరాలు బయటపడతాయని ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. భాగ్యనగరంతో పాటు దేశంలో ప్రధాన నగరాల్లో ఎలాంటి పేలుళ్లకైనా ఈ ఉగ్రమూకలు దాడులకు ప్రణాళికలు రచించాయా? అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో గడిచిన 18 నెలలుగా రాడికల్ ఇస్లామిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ 16 మంది ఎవరెవరితో టచ్ లో ఉన్నారు? ఎక్కడెక్కడకు తిరిగారు? వీరికి ఆర్ధికంగా సహకరించిన వారెవరు? అనే విషయమై దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిపై ఇంటలిజెన్స్ నిఘాను ఏర్పాటు చేసింది. హైద్రాబాద్‌కు చెందిన ఐడుగురితో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మందితో ఎలా పరిచయం ఏర్పడింది? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
అంతేకాదు నిందితుల ఫోన్ల డేటాను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన పోలీసులు కూడా మధ్యప్రదేశ్ పోలీసులకు కొంత సమాచారం అందజేశారు. మరోవైపు భోపాల్‌లోని ఐష్‌బాగ్, చింద్వారాలో కూడా అర డజనుకు పైగా అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. పట్టుబడ్డ వారికి హిజబ్ ఉత్ తహ్రీర్ సంస్థ తో లింకులున్నట్లు గుర్తించారు. కాగా, గతంలో ఇలాగే హైదరాబాద్ నుంచి కొంత మంది సిరియా వెళ్లి ఐఎస్‌ఐఎస్‌లో చేరే ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. కొంత మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) ఎన్‌ఐఏ వంటి సంస్థలు పట్టుకున్నాయి. ఆ తర్వాత అంతర్జాతీయంగా ఐఎస్‌ఐఎస్‌తో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలు బలహీనపడ్డాయి. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కూడా ఇలాంటి వార్తలు తగ్గిపోయాయి. హఠాత్తుగా ఇప్లుడు ఏకంగా పదహారు మందిని అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది.
గత ఏడాది ఏప్రిల్‌లో ఐఎస్‌ఐఎస్ సానుభూతి పరుడు అరెస్ట్…
గత ఏడాది ఏప్రిల్‌లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిని అరెస్ట్ చేశారు. పాతబస్తీకి చెందిన సులేమాన్ అనే ఐఎస్‌ఐఎస్సానుభూతిపరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్‌ఐఎస్‌కు మద్దతుగా, ఐసిస్ భావజాలాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. సులేమాన్ పేరుతో 20 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు సులేమాన్ ను అరెస్ట్ చేశారు. దేశంలో ఐఎస్‌ఐఎస్ కదలికల్ని నాలుగు రోజుల క్రితం గుర్తించాయి భద్రతా బలగాలు. ఈనేపథ్యంలో హైదరాబాద్ లో సానుభూతిపరుడిని అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఐఎస్‌ఐఎస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఐఎస్‌ఐఎస్ తరపున యుద్ధం చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నాడు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా దేశంలో ఐఎస్‌ఐఎస్
మాడ్యూల్స్ ఉన్నాయన్న అనుమానంతో ప్రత్యేకంగా నిఘా పెట్టారు.
పోలీసుల అప్రమత్తం.. భద్రత కట్టుదిట్టం…
మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన పోలీసులు హైదరాబాద్ నగరంలో ఏకంగా 16 మంది ఉగ్ర అనుమానితులను అరెస్టు చేయడం భాగ్యనగరిలో కలకలం రేపింది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే, ప్రజలను సైతం అప్రమత్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉగ్ర కదలికల నేపథ్యంలో లుంబిని పార్క్, దిల్‌షుఖ్ నగర్, గోకుల్ చాట్, చార్మినార్ వంటి ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పూర్తి స్థాయిలో నిఘా…
ప్రస్తుతం జంట నగరాల్లో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవని పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ అయిన వారంతా భోపాల్ నుంచి వచ్చిన వారేనని భావిస్తున్నారు. షెల్టర్ కోసమో లేకపోతే ఎవరి దృష్టి పడకుండా ఉండటానికో హైదరాబాద్ వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఈ అంశాన్ని తేలికగా తీసుకోవాలని భద్రతా సంస్థలు అనుకోవడం లేదు. పూర్తి స్ధాయిలో నిఘా పెడుతున్నాయి. అంతర్గత భద్రత విషయంలో కేంద్రం ఎలాంటి చిన్న అనుమానం వచ్చినా ఎవర్నీ వదిలి పెట్టడం లేదు.