Monday, December 23, 2024

ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థుల ర్యాంకుల పంట..

- Advertisement -
- Advertisement -

ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థుల ర్యాంకుల పంట
ఎంపిసిలో 32 మందికి, బైపిసిలో 9 మందికి ర్యాంకులు
సీనియర్ ఇంటర్‌లో 44 మందికి పదిలోపు ర్యాంకులు
జూనియర్ ఇంటర్‌లో 301 మందికి పదిలోపు ర్యాంకులు
వృత్తివిద్యా కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన 17 మంది విద్యార్థులు
విద్యార్థులు, సబ్బందిని అభినందించిన మంత్రి గంగుల కమలాకర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబా పూలే బిసి గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి సత్తా చాటారు. వందల సంఖ్యలో విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించి ఫలితాల్లో ప్రభంజనం కొనసాగించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సకల సౌకర్యాలతో ఉన్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో బిసి బిడ్డలకు అందించిన విద్య ఫలితమే ఈ ఫలితాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, బిసి గురుకుల సిబ్బందిని ఆయన అభినందించారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో సీనియర్ ఇంటర్‌లో 44 మంది విద్యార్థులు పది లోపు ర్యాంకులు సాధించగా ఆరు కాలేజీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. సీనియర్ ఇంటర్‌లో 86.67 శాతం ఉత్తీర్ణత సాధించారు.

జూనియర్ ఇంటర్‌లో 301 మంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించగా మూడు కాలేజీలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జూనియర్ ఇంటర్‌లో 78.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు 8,527 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 8,516 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 7,381 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 5,812 మంది ఎ గ్రేడ్, 1,225 మంది ‘బి’ గ్రేడ్, 301 మంది ‘సి’ గ్రేడ్, 43 మంది డి గ్రేడ్ పొందారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 8,434 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 8,425 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 6,637 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో 4,135 మంది ‘ఎ’ గ్రేడ్, 1,695 మంది ‘బి’ గ్రేడ్, 604 మంది ‘సి’ గ్రేడ్, 203 మంది ‘డి’ గ్రేడ్ పొందారు.

సీనియర్ ఇంటర్‌లో ర్యాంకులు
ఎంపిసిలో శ్రీజ (ఖానాపూర్), 991 మార్కులతో 4వ ర్యాంకు, కె. మహేశ్ (చిట్యాల) 990 మార్కులతో 5వ ర్యాంకు, సాధించగా మరో 33 మంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించారు. బైపిసిలో పల్లవి (సంగారెడ్డి) 989 మార్కులతో 6వ ర్యాంకు, నందిని 988 మార్కులతో 7వ ర్యాంకు సాధించారు. మరో 9 మంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించారు. ఎంఈసిలో అనిత (కల్వకుర్తి) 981 మార్కులతో 8వ ర్యాంకు సాధించింది. సిఇసిలో దీక్షిత (ఖానాపూర్) 977 మార్కులతో 8వ ర్యాంకు, అభి సాత్విక (రామగుండం) 976 మార్కులతో 9వ ర్యాంకు సాధించారు.

జూనియర్ ఇంటర్‌లో ర్యాంకులు
ఎంపిసిలో హరిత (మందమర్రి) 468 మార్కులతో 1వ ర్యాంకు, భూమిక (సికిందరాబాద్), కీర్తి (చందుపట్ల) 467 మార్కులతో రెండవ ర్యాంకు సాధించారు. వీరితో పాటు 230 మంది పదిలోపు ర్యాంకులు సాధించారు. బైపిసిలో రిషిత (వరంగల్) 435 మార్కులతో 4వ ర్యాంకు, 434 మార్కులతో 10 మంది 5వ ర్యాంకు సాధించారు. మొత్తం 55 మంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించారు. ఎంఈసిలో స్వప్న (సంగారెడ్డి), మధులత (జగ్‌దేవ్‌పూర్) 492 మార్కులతో 4వ ర్యాంకు, సాధించగా పది మంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించారు. హెచ్‌ఇసిలో నాగారాణి (ఎల్‌ఎండి కాలని) 489 మార్కులతో మొదటి ర్యాంకు, నాగ త్రిష (లంకపల్లి) 488 మార్కులతో 2వ ర్యాంకు సాధించారు. సిఇసిలో ప్రవల్లిక(జగ్‌దేవ్‌పూర్)488 మార్కులతో 5వ ర్యాంకు సాధించగా మరో ఏడు మంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించారు.

మంత్రి గంగుల అభినందనలు
ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థులు సాధించిన ప్రతిభను బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. పేద బిసి విద్యార్థులకు ఉన్నత విద్య అందించే లక్షంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బిసి గురుకుల విద్యాసంస్థలను ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేశారని, గతంలొ 19 ఉన్న జూనియర్ కాలేజీల సంఖ్యను 142కు పెంచడంతో వేలాది మంది విద్యార్థులు చదువుకుని తమ జీవితాలను చక్కదిద్దుకునేందుకు మార్గం ఏర్పడిందని అన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, బోధనా సిబ్బందిని బిసి సంక్షేమ శాఖ ఇంచార్జి ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్ చోంగ్తు అభినందించారు. ఇంటర్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిసి గురుకులాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు విద్యార్థులను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News