హైదరాబాద్ : రాష్ట్రం నుంచి పార్ బాయిల్డ్ రైస్‌ను తీసుకునేందుకు తాను చేసిన విజ్ఞప్తి మేరకు గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 2021 -22 (రబీ) పంట కాలానికి సంబంధించి 15 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్‌ను తెలంగాణ రైతుల నుంచి సేకరించేలా అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ ఏప్రిల్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కి రాయడం జరిగిందన్నారు.
ఈ లేఖకు అనుకూలంగా పీయూష్ గోయల్ స్పందిస్తూ 2021 -22 (రబీ)/ 2022- 23 (ఖరీఫ్) పంట కాలాలకు సంబంధించి మొత్తం 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు, లక్ష్యానికి తగినట్లుగా మిగిలిన బియ్యాన్ని రా రైస్ రూపంలో నిర్ధేశించిన గడువులోపు ఎఫ్‌సిఐకు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఎఫ్‌సిఐకు బియ్యాన్ని అందించటానికి ఉన్న గడువును ఇప్పటికే పలుమార్లు పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బియ్యాన్ని పూర్తిస్థాయిలో అందించని కారణంగా, తన విజ్ఞప్తి మేరకు గడువును మే 31వరకూ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
కొందరూ మిల్లర్లు అడ్డదారిన సరఫరా చేస్తున్న రీసైకిల్ బియ్యాన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, సమయానికి ధాన్యాన్ని సేకరించి, పెరుగుతున్న సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకొని, రీసైకిల్ బియ్యం సరఫరాను అరికట్టి, ఒప్పందం మేరకు ఎఫ్‌సిఐకి సకాలంలో బియ్యాన్ని అందించడంలో ఒక నిర్ధిష్ట ప్రణాళికను రూపొందించుకొని రైతుల శ్రేయస్సుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.