Friday, September 20, 2024

ప్రపంచ బాక్సింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు ఖాయం

- Advertisement -
- Advertisement -

సెమీస్‌లో హుసాముద్దీన్, నిశాంత్
ప్రపంచ బాక్సింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు ఖాయం
తాష్కెంట్: ఉజ్బెకిస్థాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. తెలుగుతేజం మహ్మద్ హుసాముద్దీన్, నిశాంత్ దేవ్, దీపక్ భోరియాలు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ క్రమంలో భారత్‌కు కనీసం మూడు కాంస్య పతకాలను ఖాయం చేశారు. బుధవారం జరిగిన పురుషుల 51 కిలోల క్వార్టర్ ఫైనల్లో దీపక్, 57 కిలోల విభాగంలో హుసాముద్దీన్, 71 కిలోల విభాగంలో నిశాంత్ దేవ్ విజయం సాధించారు. దీంతో భారత్‌కు రికార్డు స్థాయిలో మూడు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. కిర్గిస్థాన్‌కు చెందిన నుర్జిగిట్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ బాక్సర్ దీపక్ అలవోక విజయం సాధించాడు.

ఆరంభం నుంచే తనదైన పంచ్‌లతో విరుచుకు పడిన దీపక్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దూకుడును ప్రదర్శిస్తూ 50 తేడాతో ప్రత్యర్థి చిత్తు చేసి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరో క్వార్టర్ ఫైనల్లో నిశాంత్ దేవ్ కూడా సునాయాస విజయం సాధించాడు. క్యూబాకు చెందిన జార్జ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో నిశాంత్ 50 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. తన మార్క్ పంచ్‌లతో అలరించిన నిశాంత్ ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. చివరి వరకు దూకుడును ప్రదర్శిస్తూ సునాయాస విజయాన్ని అందుకున్నాడు. ఈ గెలుపుతో నిశాంత్‌కు సెమీస్ బెర్త్ సొంతమైంది.

హుసాముద్దీన్ ముందుకు..
మరోవైపు తెలంగాణ యువ సంచలనం హుసాముద్దీన్ కూడా సెమీస్‌కు చేరుకున్నాడు. బుధవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 43 తేడాతో బల్గేరియాకు చెందిన డియాజ్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన హుసాముద్దీన్ మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News