ఎగవేతలపై దృష్టి సారించాలి
ఈ ఏడాది రూ.85,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాలి
వాణిజ్యపన్నుల శాఖ అధికారులకు సిఎస్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: ఎగవేతలపై దృష్టి సారించడంతో పాటు ఈ ఏడాది రూ.85,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రయత్నాలను విస్తరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు. 2022-23 సంవత్సరానికి గాను అసాధారణ పనితీరు కనబర్చినందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ఆమె అభినందించారు. వాణిజ్య పన్నుల శాఖలోని సీనియర్ అధికారులతో సిఎస్ సమగ్ర సమీక్ష నిర్వహించి, అదనపు వనరులను పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఆమె చర్చించారు.
ఆదాయాన్ని పెంచేందుకు వినూత్న సూచనలతో ముందుకు వచ్చిన ఆ శాఖ ఉన్నతాధికారులను ఆమె అభినందించారు. పన్ను ఆదాయాన్ని పెంచడానికి సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సిఎస్ అధికారులను కోరారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడంతో పాటు ఎగవేతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు. అప్పీలేట్ జాయింట్ కమిషనర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రతి పదిహేను రోజులకోసారి సమీక్షించాలని సిఎస్ కమిషనర్‌ను ఆదేశించారు.
ఆదాయం ఎక్కువగా వచ్చే ప్రాంతాలను మ్యాప్ చేసి, క్రమపద్ధతిలో వాటి నుంచి ఆదాయాన్ని రాబట్టాలన్నారు. ఆదాయాన్ని పెంపొందించేందుకు కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను బలోపేతం చేయడం, స్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ సమావేశంలో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్, అదనపు కమిషనర్లు సాయికిషోర్, హరిత, జాయింట్ కమిషనర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.