Monday, December 23, 2024

డ్రోన్లతో విధ్వంసానికి కుట్ర

- Advertisement -
- Advertisement -

భాగ్యనగర్ ‘ఉగ్ర’ కుట్ర కేసు
భోపాల్, హైద్రాబాద్ లలో డ్రోన్లతో దాడులకు ప్లాన్
వికారాబాద్ అడవుల్లో ఫైరింగ్ శిక్షణ
డార్క్ వెబ్ ద్వారా కమ్యూనికేట్
హైదరాబాదును ఒక స్లీపర్ సెల్‌గా వాడుకుని పెద్ద పెద్ద నగరాల్లో పేలుళ్లకు కుట్ర
మన తెలంగాణ/హైదరాబాద్: భాగ్యనగర్ ఉగ్ర కుట్ర కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్, భోపాల్ లో డ్రోన్ల ద్వారా దాడులు చేయాలని నిందితులు ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్వాడ్ (ఎటిఎస్), తెలంగాణ పోలీసులు భాగ్యనగరంలో సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. విశ్వనగరంగా వెలుగొందుతున్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో అశాంతి నెలకొల్పాని ప్రయత్నించిన కొన్ని సంఘ విద్రోహ శక్తులను స్థానిక పోలీసులతో పాటు నిఘా సంస్థలు అణిచివేశాయి. పాపులర్ ఫ్రంట్ నుంచి విడిపోయిన కొంత మంది కార్యకర్తలు ఇస్లామిక్ రాడికల్స్‌గా ఏర్పడి హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

హైదరాబాద్‌లో అరెస్టైన ఆరుగురితో పాటు మొత్తంగా 17 మంది ఉగ్ర అనుమానితులని భోపాల్‌కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న వీరిపై దర్యాప్తు సంస్థలు చాలా కాలంగా నిఘాను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్‌కు చేరుకున్న ఎటిఎస్ టీమ్ పాతబస్తీలో ఉంటున్న వీరి గురించి సమాచారం ఇచ్చింది. వీరికి సంబంధించిన సమా చారాన్ని కౌంటర్ ఇంటలిజెన్స్ కూడా ఎటిఎస్‌తో పంచుకుంది. రెండు రోజుల క్రితం 16 మందిని అరెస్ట్ చేశారు. బుధవారం ఒకరు అరెస్ట య్యారు. హైదరాబాదును ఒక స్లీపర్ సెల్‌గా వాడుకుని పెద్ద పెద్ద నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్టు పోలీసులు గుర్తించారు. కీ ఆఫ్ రైట్ పాత్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహించినట్లు గుర్తించారు.

బయాన్ పేరుతో హైదరాబాద్ గోల్కొండలోని సమావేశాలు నిర్వహించినట్టు మధ్యప్రదేశ్ ఎటిఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. వీళ్లంతా ఒకరితో ఒకరు నేరుగా కాకుండా డార్క్ వెబ్ ద్వారా కమ్యూని కేట్ అవుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. దేశంలోని పెద్ద పెద్ద నగరాలనే టార్గెట్ చేసుకుని నిందితులు స్థిరపడ్డట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అరెస్టయిన వాళ్లంతా హిజ్బ్ ఉత్ తహ్రీర్ సంస్థకు చెందిన వారని పోలీసులు విచారణలో తెలిసింది. వీళ్లంతా హైదరా బాద్‌కు చేరుకుని ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు రాకుండా వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. వికారాబాద్ అడవుల్లో ఫైరింగ్ శిక్షణలు నిర్వహి స్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎయిర్ పిస్టోళ్లు, ఎయిర్ గన్లతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసినట్టు సమాచారం అందుతోంది. వీటితో పాటు యూట్యూబ్‌లో ఆత్మాహుతి దాడులు, గ్రనైడ్, కెమికల్ అటాక్స్‌పై కూడా అవగాహన పెంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే హైదరా బాద్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేసినట్టు తెలుస్తోంది.

షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు వంటి జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాడులు చేయాలని నిందితులు ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించినట్టుగా ప్రచారం సాగుతుంది. మాల్స్ వంటి వాటిని తమ ఆధీనంలోకి తీసుకొని భయబ్రాంతులకు గురిచేయాలని ప్లాన్ చేశారని సమాచారం. కనీసం రెండు రోజుల పాటు అన్నం, నీళ్లు లేకుండా ఉండే విషయంలో కూడా వీరంతా శిక్షణ పొందారని తెలిసింది. యూట్యూబ్‌లలో వీడియోలు చూసి ఈ విషయమై నిందితులు ఫిట్ నెస్ శిక్షణ పొందారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందు కోసం చాలా మంది నగరంలో సెటిల్ అయినట్టు తెలుస్తోంది. ఒకరికి ఒకరు సంబంధం లేకుండా టీచర్, సాఫ్ట్‌వేర్లు, కూలీలు, డాక్టర్లు ఇలా రకరకాల వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే వీళ్లంతా ఇంకేంత మందిని రిక్రూట్ చేసుకున్నారన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే మీటింగ్‌కు ఎవరెవరు హాజరయ్యారు అన్న అంశంపై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ దృష్టి సారించింది.

2018లో ప్రధాన నిందితుడు మహ్మద్ సలీం అలియాస్ సౌరబ్ రాజ్ హైదరాబాద్‌కు రాక
2018లో ప్రధాన నిందితుడు మహమ్మద్ సలీం అలియాస్ సౌరబ్ రాజ్ హైదరాబాద్‌కు వచ్చినట్లు గుర్తించారు. ఓ వ్యాపారవేత్త సూచనలు మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మెడికల్ కళాశాలలో మహమ్మద్ సలీం ఉద్యోగం సంపాదించాడు. ఐదేళ్లుగా మైక్రో బయోలజికల్ డిపార్ట్‌మెంట్‌కు హెచ్‌ఒడిగా విధులు నిర్వహిస్తున్నాడు. భోపాల్ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చిన తర్వాత తన కార్యకలాపాలు సలీం విస్తృతం చేశాడు.

అప్రమత్తం.. దర్యాప్తు ముమ్మరం: హోం మంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్‌లో ఇస్లామిక్ రాడికల్స్ కలకలం రేపిన ఘటనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఇస్లామిక్ రాడికల్స్ కేసులో పోలీసు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారని తెలిపారు. ఈ కేసులో అధికారులు హైదరాబాద్‌లో ఆరుగురిని అరెస్ట్ చేశారని చెప్పారు. అరెస్టైన వారి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో చోటుచేసుకోకుండా హోం శాఖ అప్రమత్తమైందని స్పష్టం చేశారు. వీలైనంత త్వరలో ఇస్లామిక్ రాడికల్స్ పట్టుపడతామని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News