Saturday, December 21, 2024

విపక్షాల ఐక్యతలో మరో అడుగు

- Advertisement -
- Advertisement -

పవార్ నివాసంలో నితీశ్ భేటీ.. కలిసిరావాలనే పిలుపు
ముంబైకి వచ్చిన సందర్భంగా ఉద్ధవ్‌తో భేటీ
కర్నాటక ఫలితాల తరువాత మరో మలుపు సంకేతాలు

ముంబై: దేశంలో ప్రతిపక్ష ఐక్యత దిశలో చర్చించేందుకు సీనియర్ నేతలు నితీశ్‌కుమార్, శరద్ పవార్‌లు గురువారం ఇక్కడ సమావేశం అయ్యారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా విపక్షం సంఘటితం అయ్యి, బిజెపిని ఎదుర్కొని, ఎన్నికలకు సమాయత్తం కావల్సి ఉందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సాగిస్తోన్న విపక్ష ఐక్యత దిశలో భాగంగా గురువారం ఎన్‌సిపి నేత పవార్ నివాసానికి వెళ్లారు. ఆయన వెంబడి బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు. విపక్ష ఐక్యత, ఒకవేళ కూటమి ఏర్పాటు అయితే ప్రధాన కేంద్ర బిందువుగా పవార్ ఉంటారా? అని విలేకరులు నితీశ్‌ను ప్రశ్నించారు.

దీనికి ఆయన స్పందిస్తూ ఇదే జరిగితే ఇంతకంటే ఆనందదాయక విషయం మరోటి ఉండదని, దీనిపై ఆయనతో తాను మాట్లాడానని తెలిపిన నితీశ్ సీనియర్ నేత అయిన పవార్ కేవలం తమ పార్టీకోసమే కాకుండా మొత్తం దేశం కోసం మరింత ఉత్సాహంతో పనిచేయాల్సి ఉందన్నారు. దీనిని ఆయనకు స్ప ష్టంగా తెలిపినట్లు వివరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కేవలం స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోందని, దేశ ప్రయోజనాల కోణంలో ఆలోచించడం లేదనే విషయం పలు విషయాలతో స్పష్టం అయిందన్నారు. దేశ ప్రయోజనాల దిశలో ప్రతిపక్షాలు ఎక్కువగా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇది దేశ ప్రయోజనాల కోసం అత్యవసరం అని తెలిపారు. రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కంటే ఎక్కువగా దేశ ప్రయోజనాలు, దేశ భవిత గురించి ఆలోచించాల్సి ఉంటుందన్నారు.

కలిసి ఉంటే కలదు ప్రజాస్వామ్యం ః పవార్
దేశ ప్రజాస్వామిక పంథాను పరిరక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్క పార్టీపై ఉందని శరద్ పవార్ తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కేవలం ఎవరికి వారు నినాదాలకు దిగితే సాధ్యం కాదని, ప్రతిపక్ష ఐక్యతతోనే ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ శక్తి అవసరం ఉంది. అయితే ఇది బలీయంగా ఉందనే విషయం ప్రజలకు తెలియచేయగలగాలి. ఎప్పుడు అయితే ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తాయో అప్పుడు సహజంగానే ప్రత్యామ్నాయ శక్తి ఏర్పడుతుందన్నారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గీటురాయి
అత్యంత కీలకమైన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న బిజెపి పరాజయం పొందితే తనకు తెలిసిన సమాచారం తన విశ్లేషణ మేరకు ప్రజలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని కూడా తిరస్కరిస్తారు. లౌకిక ప్రభుత్వానికి ఓటేస్తారని పవార్ తెలిపారు. శనివారం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. తన నివాసానికి మంచి ఉద్ధేశంతో వచ్చిన నితీశ్ కుమార్‌కు, తేజస్వీకి స్వాగతం అని తాను వీరితో ప్రతిపక్ష ఐక్యతపై సంక్షిప్త చర్చలు జరిపినట్లు పవార్ వివరించారు. ఇక్కడకు వచ్చిన నితీశ్, తేజస్వీ ఆ తరువాత నేరుగా వెళ్లి మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలిశారు . ఉమ్మడిగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ధవ్ వీరికి తెలిపినట్లు వెల్లడైంది. ముంబై రావడానికి ముందు నితీశ్ రాంచీలో జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్‌తో చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News