Tuesday, January 21, 2025

మావోయిస్టు నేరెళ్ల జ్యోతి లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : మావోయిస్టు పార్టీ డిసిఎం నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క కరీంనగర్ పోలీసుల ముందు లొంగిపోయారు. శుక్రవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సుబ్బారాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లికి చెందిన జ్యోతి (38) రెండు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నారని డీసీఎం హోదాలో ప్రెస్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని మంగి ఏరియాలో పనిచేసిన జ్యోతి 2011లో జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకుని మావోయిస్టు పార్టీ నేత జంపన్నతో కలిసి ఒడిషాకు వెళ్లి అక్కడి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నదని వివరించారు.

ఒడిషాలో ప్రెస్‌కమిటీ మెంబర్స్‌గా పని చేస్తున్న సమయంలో ఎర్రగొల్ల రవి అలియాస్ దినేష్‌ను వివాహం చేసుకోగా వీరిద్దరి మధ్య వచ్చిన విబేధాల కారణంగా విడిపోయారన్నారు. మొత్తం ఐదు కేసుల్లో ఉన్న జ్యోతి ఆపరేషన్ చేయూత్ కార్యక్రమంలో భాగంగా లొంగిపోయినట్టు సీపీ వెల్లడించారు. చత్తీస్‌గడ్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న మావోయిస్టులు ఆదివాసీ బిడ్డలను వదిలేసి జన జీవనంలో కలవాలని సీపీ పిలుపునిచ్చారు. అమాయకుల జీవితాలతో చెలగాటమాడకూడదని, మైనర్లను కూడా పార్టీ కార్యకలాపాల్లో వినియోగిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన నక్సల్స్‌కు ఆదుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. అడవిని వదిలి జనంలోకి వచ్చి సాధారణ జీవనం సాగిస్తే ప్రభుత్వం తరుపున అందించే పునరావాసం స్కీంలను అమలు చేస్తామని సీపీ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News