Sunday, November 24, 2024

సన్‌రైజర్స్‌కు లక్నో షాక్.. హైదరాబాద్ ఆశలు గల్లంతు!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా శనివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. దీంతో హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలకు దాదాపు తెరపడినట్టే. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన లక్నో నాకౌట్ అవకాశలను మరింత పెంచుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

తర్వాత లక్షఛేదనకు దిగిన లక్నో 19.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఓపెనర్ కైల్ మేయర్స్ 14 బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేశాడు. అయితే మరో ఓపెనర్ క్వింటాన్ డికాక్‌తో కలిసి వన్‌డౌన్‌లో వచ్చిన ప్రేరక్ మన్కడ్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. అయితే మూడు ఫోర్లు, సిక్సర్‌తో 29 పరుగులు చేసిన డికాక్‌ను మర్కాండే వెనక్కి పంపాడు. దీంతో 54 పరుగులకే లక్నో రెండు వికెట్లు కోల్పోయింది.

ఆదుకున్న మన్కడ్, స్టోయినిస్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మన్కడ్, స్టోయినిస్ తమపై వేసుకున్నారు. ఇద్దరు హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును లక్షం దిశగా నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు సన్‌రైజర్స్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. దూకుడుగా ఆడిన స్టోయినిస్ 25 బంతుల్లోనే 3 సిక్సర్లు, రెండు బౌండరీలతో 40 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో మూడో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు.

పూరన్ వీర విహారం..
తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. అప్పటి వరకు అద్భుత బౌలింగ్‌ను కనబరుస్తూ వచ్చిన సన్‌రైజర్స్ బౌలర్లను పూరన్ కోలుకోలేని దెబ్బతీశాడు. అతని విధ్వంసక బ్యాటింగ్‌తో లక్నో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. చెలరేగి ఆడిన పూరన్ 13 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయంగా 44 పరుగులు చేశాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన ప్రేరక్ మన్కడ్ 45 బంతుల్లో రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇక పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడంతో లక్నో మరో 4 బంతులు మిగిలివుండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ను క్లాసెన్ (47), అబ్దుల్ సమద్ 37 (నాటౌట్) ఆదుకున్నారు. అన్మోల్‌ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), కెప్టెన్ మార్‌క్రమ్ (28) తమవంతు పాత్ర పోషించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News