Monday, December 23, 2024

కార్మికుల రక్షకుడు అంబేడ్కర్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ దేశాలలో భారత దేశం 142. 86 కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉండగా, ఈ జనాభాలో 52.8% కార్మికుల ఉన్నారు. ఇందులో 7 శాతం మంది సంఘటిత రంగంలోనూ, 93 శాతం మంది అసంఘటిత రంగంలోనూ పని చేస్తున్నారు. ఏ దేశం అభివృద్ధి అయినా ఆ దేశ కార్మికులపై ఆధారపడి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు కార్మికులు మెజారిటీగా వ్యవసాయ రంగంలో ఉండేవారు. వీరందరూ నిరక్షరాస్యులు, అమాయకులు కావడంతో బడా భూస్వాములు మోతుబరి రైతులు వీరిని కట్టుబానిసలుగా చూసేవారు. వీరికి పని చేయటం తప్ప హక్కులు అనే పదం కూడా తెలియదు. తర్వాత కాలంలో ఈస్ట్‌ఇండియా కంపెనీ వారు మన దేశానికి రావడంతో దేశ వనరులను కొల్లగొట్టి వారి వ్యాపారానికి అవసరమైన కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసి యజమానులుగా ఉన్న విదేశీ బ్రిటిష్ వారు వారి హక్కులను కాపాడుకోవడానికి కార్మికులను వారి కబంధహస్తాలలో వుంచుకుంటూ బ్రిటిష్ వారికి అనుకూలంగా కొన్ని చట్టాలను తీసుకొచ్చారు. కానీ కార్మికుల దిన స్థితిలో ఎటువంటి మార్పురాకపోగా రోజురోజుకు దిగజారిపోతూ దోపిడీకి గురవుతూ ఉండేవారు.

భారత దేశంలో మెజారిటీగా ఉండి దేశానికి సంపాదన సృష్టిస్తూ దేశ ఆర్థిక రంగానికి వెన్నెముకగా ఉన్న కార్మికుల కష్టాలను, యాజమాన్యం దోపిడీని చదివి అవగాహన చేసుకున్న అంబేడ్కర్ భారత దేశంలోని యావత్ కార్మిక లోకాన్ని బానిసత్వం నుంచి విముక్తి కల్పించి, వారికి కనీస మానవ అవసరాలను, హక్కులను కల్పించడానికి, వారిని చైతన్య పరచడానికి దేశంలో మొట్టమొదటిగా కార్మికులు, కర్షకులు, అట్టడుగువర్గాల కోసం బ్రాహ్మణిజానికి, కేపిటలిజానికి వ్యతిరేకంగా ఆగస్టు 15, 1936న ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించి 1937లో జరిగిన ప్రొవెన్షనల్ ఎలక్షన్‌లో 17 సీట్లకుగాను 15 సీట్లను గెలుచుకున్నారు. ముంబై లెజిస్లేటివ్ అసెంబ్లీలో 1937 నుండి 1942 వరకు సభ్యునిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 22 జులై 1942 నుండి 21 అక్టోబర్ 1946 వరకు వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో లేబర్ మినిస్టర్‌గా పని చేశారు. ఈ సమయంలోనే దేశంలోని కార్మికుల హక్కులు పురుడుపోసుకున్నాయి. అప్పటి ప్రభుత్వం కార్మికులు సమ్మె చేయడం చట్టవిరుద్ధమని 1938వ సంవత్సరంలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ బిల్లును ప్రవేశపెడితే అంబేడ్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో 20 వేల మంది బొంబాయి టెక్స్‌టైల్స్ కార్మికులతో పెద్ద ర్యాలీ చేసి సమ్మె అనేది కార్మికుల చట్టబద్ధమైన హక్కు అని ఉద్యమించి ముంబై లెజిస్లేటు అసెంబ్లీలో ఇది చెడ్డనెత్తురోడుతున్న రక్తదాహం అని తిరుగుబాటు చేసి కార్మికులకు సమ్మె అనేది చట్టబద్ధమైన హక్కుగా సాధించారు.

న్యూఢిల్లీలో ఆగస్టు 7, 1942న జరిగిన నాలుగవ కార్మిక సదస్సులో అంబేడ్కర్ మూడు లక్ష్యాలు సాధించాలని మొదటిగా దేశ వ్యాప్తంగా కార్మిక చట్టాలను ఒకే రకంగా ఉండాలి. రెండవది ఇండస్ట్రియల్ డిస్‌ప్యూట్ సెటిల్మెంట్ గూర్చి అంటే కార్మికులకు యాజమాన్యానికి మధ్య వచ్చే సమస్యల పరిష్కారం గూర్చి ఒక విధానాన్ని రూపొందించాలని ప్రతిపాదిస్తూ కార్మికులు యాజమాన్యం ఒకరి పట్ల ఒక రు బాధ్యతాయుతంగా, గౌరవంగా వ్యవహరించాలి అని తెలియజేశారు. మూడవదిగా దేశ వ్యాప్తంగా ముఖ్యమైనది కార్మికులు, మూలధనం ప్రాముఖ్యత కార్మికుల సంక్షేమం, కార్మికుల విలువలను కాపాడటం. సెప్టెంబర్ 15 1943 న్యూఢిల్లీలో జరిగిన త్రిపార్ట్‌మెంట్ లేబర్ కౌన్సిల్ సదస్సులో అంబేడ్కర్ మాట్లాడుతూ కార్మికుల పాలసీని రూపొందించేటప్పుడు మూడు పార్టీలైన కార్మికులకు, యాజమాన్యానికి ప్రభుత్వాలకు సమాన అవకాసం కల్పించి చర్చించిన తరువాత కార్మిక పాలసీలను తయారు చేయాలి అని ప్రతిపాదించారు. అంతేకాకుండా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ప్రతిపాదించి మెడికల్ కేర్, మెడికల్ లీవ్, శారీరక అంగవైకల్యం వచ్చిన కార్మికుల బాగోగులను యాజమాన్యమే చూసుకునేలా పాలసీలను తయారు చేశారు.కార్మికుల హక్కులను, వారి సామాజిక రక్షణలను ఉద్యోగ భద్రత, జీతభత్యాల కాపాడుకోవటానికి, మెరుగుపరుచుకోవటానికి సంఘంగా ఏర్పడిన కార్మికులను ట్రేడ్ యూనియన్ అంటారు. ట్రేడ్ యూనియన్ చట్టం 1926 ప్రకారం కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకునే అవకాశం ఉంది.

దీనివల్ల కార్మికులకు ఎటువంటి ప్రయోజనం లేదని 1944లో అంబేడ్కర్ పోరాడి ప్రతి సంస్థలోని ట్రేడ్ యూనియన్‌ను ఆయా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వాలు గుర్తించాలని అప్పుడు మాత్రమే కార్మికులకు వారి హక్కుల రక్షణ కోసం యాజమాన్యాలతో చర్చలు చేసుకుని అధికారం వస్తుంది అని చెప్పి దానిని సాధిస్తారు. దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే నైపుణ్యమైన కార్మికుల అవసరం ఉన్నది అని గుర్తించి టెక్నికల్, నాన్ టెక్నికల్ నైపుణ్యం గల కార్మికులను గుర్తించటానికి, తక్కువ నైపుణ్యం గల కార్మికులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యం గల కార్మికులుగా తయారు చేయడానికి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌ను మే 7, 8 తేదీల్లో ముంబైలో జరిగిన స్టాండింగ్ లేబర్ కమిటీలో అంబేడ్కర్ భారత ప్రభుత్వ లేబర్ మెంబర్‌గా పాల్గొని ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి స్థాపనకు పునాది వేశా రు. తరచుగా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిల పని తీరును పరిశీలించడానికి వివిధ రాష్ట్రాలు తిరిగేవారు. ఆ క్రమంలో పశ్చిమ బెంగాల్ వెళ్ళినప్పుడు ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్‌ల పాత్ర చాలా మెరుగ్గా ఉన్నది అని గమనిస్తారు. అంతేకాకుండా కార్మికుల స్థితిగతులు, వారి సంఖ్య, జీతాలు మొదలగు సమాచారం కోసం 1942లో ఇండియన్ స్టాటిస్టికల్ యాక్ట్ తీసుకుని వస్తారు.

భారత ప్రభుత్వ కార్మిక సభ్యునిగా బొగ్గు గనుల పని విధానం, కార్మికుల, యాజమాన్యం స్థితిగతులను, కార్మికుల క్వాటర్స్, కాలనీలను తెలుసుకోవడానికి నిరంతరం సందర్శిస్తూ ఉండేవారు. డిసెంబర్ 9న ధన్‌బాద్ భూగర్భంలో ఉన్న బొగ్గు గనులలో 400 అడుగుల కిందకు వెళ్ళి పరిశీలిస్తారు. అలాగే రాణిగంజ్ బొగ్గు గనులు, జారియా బొగ్గు గనులు తనిఖీ చేస్తారు. మహిళా కార్మికుల కష్టాలను, బాధలను అర్థం చేసుకుని వారి కోసం ప్రత్యేక చట్టాలను తీసు కొస్తారు అంబేడ్కర్. తన రక్తాన్ని సిరాగా మార్చి రాసిన ప్రతి అక్షరం ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ సంక్షేమంకోసం దేశ మహిళల కోసం, దేశ కార్మికుల కోసం, మేటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, మహిళా కార్మికులు సంక్షేమ నిధి, మహిళలు, బాల కార్మికుల రక్షణ, కార్మికుల మధ్య ఎటువంటి కుల, మత ప్రాంతీ య, భాష, వర్గ, లింగ భేదాలు లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని, ప్రతి కార్మికులకు కనీస జీతభత్యాలు చట్టం అమలు చేయాలని డియర్ నెస్ అలవెన్స్, రివిజన్ ఆఫ్ పే స్కేల్‌ను అంబేడ్కర్ సాధించారు.

అంతేకాకుండా భారత దేశంలో వివిధ రకాల పరిశ్రమల్లో పని చేసే కార్మికుల కోసం వర్క్ మెన్స్ కంపెన్సేషన్ బిల్, ఇండియన్ మైన్స్ బిల్, ఫ్యాక్టరీస్ రీహాబిలిటేషన్ ప్లాన్స్, వెల్ఫేర్ సోషల్ సెక్యూరిటీ ఆఫ్ వర్కర్స్, మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ బిల్, ద ఇండియన్ ఫైనాన్స్ బిల్, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ బిల్, స్ట్రైక్ బై వర్కర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్. అఖిల భారత కార్మిక సంఘాల స్టడీ క్యాంపు సెప్టెంబర్ 8 నుండి 17 వరకు 1943లో ఢిల్లీలో జరిగిన సదస్సులో కార్మికులు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే అంశంపై అంబేడ్కర్ మాట్లాడుతూ కార్మిక సంఘాలు కుల, మత, క్యాపిటలిస్ట్ రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, హిందూ మహాసభలో కలిసిపోకుండా స్వతంత్రత కోసం పోరాడుతూ సొంత రాజకీయ పార్టీని స్థాపించి కార్మిక వర్గం అంటే పాలక వర్గం అనే విధంగా రాజకీయా అధికారాలను ప్రభావితం చేయాలి అని అంటారు.

బాబాసాహెబ్ కార్మికుల కోసం ప్రతిపాదించిన ప్రతి అంశం స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగం ద్వారా చట్టాలుగా మారాయి. ప్రస్తుతం 44 కార్మిక చట్టాలు ఉండగా, వాటిని కేవలం నాలుగు కోడ్‌లగా మార్పు చేశారు. అవి కోడ్ ఆన్ వేజెస్, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ వర్కింగ్ కండిషన్స్. ఈ కోడ్‌ల ప్రకారం కార్మిక లోకం వారి ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారు. డా. అంబేడ్కర్ ద్వారా వచ్చిన కార్మిక చట్టాలను సంఘటితంగా ఉంటూ ఐక్యపోరాటాలతో కాపాడుకుంటూ వ్యక్తిగతమైన స్వార్థప్రయోజనాలను పక్కనపెట్టి సంఘ ప్రయోజనాలకు ప్రాధాన్యతను ఇస్తూ పోరాటాలు చేయడం ద్వారా కార్మికుల జీవితాలతో పాటు దేశ ప్రజల సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను సైతం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభావితం చేస్తూ పరిపాలనలో సైతం భాగం కావాలి.

డా. అంబేడ్కర్ కార్మికులకు ఏదైతే హెచ్చరిక చేశారో అదే ఇప్పుడు జరుగుతుంది. భారత దేశంలో శ్రమ విభజనతో పాటు శ్రామికుల విభజన జరిగిందని, ఆ విభజన కుల, మత, ప్రాంత, వర్గ, భాష, లింగ భేదాలతో జరిగినది. ఈ దేశానికి కులం అనేది ప్రధాన శత్రువు. దీని వల్లే కార్మికుల ఐక్యత లోపించి కార్మిక సంఘాలు బలహీనపడినవి. ఇప్పటికైనా ఈ దేశ కార్మికుల రక్షకుడైన, కార్మిక జాతి దార్శనికుడైన డా. అంబేడ్కర్ సూచించిన బాటలో ప్రయాణించి దేశానికి కులం అనేది ప్రధాన శత్రువుగా గుర్తించి కుల నిర్మూలనకు అడుగులు వేస్తూ కార్మికులందరూ ఏకమై భారత రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ ప్రసాదించిన కార్మిక చట్టాలను, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవడానికి ప్రతి కార్మికుడు సంసిద్ధమై ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.

డా. బోరుగడ్డ సుబ్బయ్య
9492704401

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News