న్యూఢిల్లీ: పోయిన లేక దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే సాంకేతికతను ఈ వారమే దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేయనున్నది. ఇందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఈ వ్యవస్థకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును కొన్ని రాష్ట్రాల్లో అమలుచేయనున్నట్లు వెల్లడించారు.
‘సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సిఈఐఆర్) వ్యవస్థను భారత దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. కాగా సీడాట్ సిఈవో రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ మాత్రం ఇంకా తేదీని ఖరారు చేయలేదన్నారు. కానీ దేశవ్యాప్తంగా అమలుచేయబోతున్నట్లు తెలిపారు. అందుకు వ్యవస్థ సిద్ధంగా ఉందన్నారు.
మొబైల్ ఫోన్‌ను విక్రయించడానికి ముందే దాని ఐఎంఈఐ నంబర్‌ను బహిర్గతం చేయాలన్నది నిబంధన. సిఈఐఆర్ వ్యవస్థలో మొబైల్ నెట్‌వర్క్‌ల దగ్గర ఐఎంఈఐ నెంబర్లు, వాటికి అనుసంధానమైన మొబైల్ నెంబర్ల జాబితా ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగానే పోయిన ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేస్తారు. తద్వారా ఫోన్ల దొంగతనాలు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. దొంగలను గుర్తించడానికి కూడా పోలీసులకు సులభం అవుతుంది.