బాలాపూర్: కుటుంబ కలహాలతో విరక్తి చెందిన ఓ మహిళ ఇద్దరు పిల్లలను హత్య చేసి, తానూ ఆత్మహత్యాయత్యానికి పాల్పడిన సంఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. అయితే సంఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా తల్లి చావుబతుకుల మధ్యకొట్టుమిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం…. రంగారెడ్డి జిల్లా, మాడ్గుల మండలం, కుబ్యాతండాకు చెందిన నేనావత్ భారతి(25)కు శ్రీనివాస్‌కు 2020లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు విక్కీ(ఏడాదిన్నర), లక్కీ (8 నెలలు) ఉన్నారు. పిల్లలతో కలిసి భార్యాభర్తలు మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఉంటున్నారు. శనివారం శ్రీనివాస్ తల్లి రాగా ఆమెతో భారతికి గొడవ జరిగింది.
Also Read: కర్నాటకలో కాంగ్రెస్ విజయం వెనుక..
అంతేకాకుండా శ్రీనివాస్, భారతికి కూడా శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆదివారం ఉదయం మరోసారి భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో మధ్యాహ్నం ఇంటి నుంచి శ్రీనివాస్ బయటికి వెళ్లగానే భారతి టబ్బులో నీళ్లు నింపి ఇద్దరు కుమారులను అందువేసి ఊపిరిఆడకుండా చేసి హత్య చేసింది. తర్వాత ఆమె విషం తాగిన అనంతరం భర్తకు ఫోన్ చేసి ఇద్దరు పిల్లలను చంపివేశానని తాను విషం తాగిన విషయం చెప్పింది. దీంతో వెంటనే ఇంటికి వచ్చిన శ్రీనివాస్ ఇద్దరు కుమారులను దిల్‌సుక్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భారతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ మహేందర్‌రెడ్డి తెలిపారు.