న్యూఢిల్లీ: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగి శాయి కానీ ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో వరస ఎన్నికలు జరగనుండడంతో వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల దాకా రాజకీయ వేడి అలాగే కొనసాగే అవకాశం ఉంది. కనీసం మూడు రాష్ట్రాలకు అ సెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో పాటుగా జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ ఏడాది మూడు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయలలో అసెంబ్లీ ఎన్నికలతో మొదలైంది. ఇక కర్నాటక తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ ,వచ్చే ఏడాది జనవరి మధ్య కాలంలో ఈ రాష్ట్రాల శాసన సభల గడువు ముగియనుండడంతో ఈ ఏడాది చివర్లో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.40 స్థానాలున్న మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17తో ముగియనుండగా చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువువచ్చే ఏడాది జనవరి 3, 6 తేదీల్లో ముగియనుంది.
ఇక రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో, తెలంగాణ అసెంబ్లీ గడువు అదే నెల 16తో ముగియనుంది. ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను తోసిపుచ్చలేము. ఈ ఎన్నికలే కాకుండా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ, కశ్మీర్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది నిర్వహించే అవకాశం లేకపోలేదు. 2023లో శీతాకాల ప్రభావం తగ్గిన తర్వాత వేసవిలో ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశముందని అధికార వర్గాలు గతంలో చెప్పాయి. జులై 1నుంచి ఆగస్టు 31 దాకా 62 రోజుల అమరనాథ్ యాత్ర ముగిసిన తర్వాత ఈ ఏడాది అక్టోబర్‌లో జమ్మూ, కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల చట్టసభల గడువు వచ్చే ఏడాది జూన్‌లో ముగియనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పార్లమెంటు ఎన్నికలతో పాటుగా నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉంది.