Thursday, December 26, 2024

కాషాయ ముప్పు తొలగలేదన్న కర్ణాటక

- Advertisement -
- Advertisement -

మూడు ముక్కలాటలకు తెరదించి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కర్ణాటక ఓటర్లు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. మతతత్వ బిజెపి, అధికారమే పరమావధిగా ఉన్న అవకాశవాద జెడి(ఎస్)కు గుణపాఠం చెప్పారు. మూడున్నర దశాబ్దాల తరువాత కాంగ్రెస్ ఓట్లు, సీట్లను కూడా భారీగా తెచ్చుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పుగా పరిణమిస్తున్న సంఘ పరివార్ శక్తులను ఎదిరించేందుకు ముందుకు వస్తున్న ఒక ప్రధాన శక్తిగా కాంగ్రెస్ విజయాన్ని లౌకిక శక్తులన్నీ హర్షించాయి. అధికారికంగా ఫలితాలను నిర్ధారించక ముందే జరిగేదేమిటో స్పష్టమైనందున మీడియా పెద్దలు సిఎం గద్దెపై కూర్చొనేదెవరు అన్న చర్చకు తెరలేపారు. కాంగ్రెస్ గతాన్ని బట్టి అలాంటి విశ్లేషణలు చేసేవారిని తప్పుపట్టనవసరం లేదు.గెలిచిన కాంగ్రెస్ సంబరాల్లో ఉంది, నరేంద్ర మోడీ ఓడినట్లుగా తాము భావించటం లేదని ఆపద్ధర్మ సిఎం బసవరాజు బొమ్మై తనను తాను ఓదార్చుకున్నారు. ఒక ఎదురుదెబ్బ ఈ ఓటమి తమనేమీ కదిలించలేదని కమలనాథులు చెప్పుకుంటున్నారు.

కాంగ్రెస్ గెలుపు కారణాలతో పాటు, బిజెపి ఓటమి గురించి విశ్లేషణలు వెలువడుతున్నాయి. జెడి(ఎస్) భవితవ్యం ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చనీయమే. విధాన సభలోని మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 135(80), బిజెపి 66(104), జెడి(ఎస్) (32) 19, ఇతరులు నాలుగు స్థానాలు తెచ్చుకున్నారు. బ్రాకెట్లలోని అంకెలు గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు. ఓట్లను చూస్తే మూడు పార్టీలకు వరుసగా 42.9, 36, 13.3 శాతం వచ్చాయి. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌కు 4.9 శాతం పెరగ్గా, బిజెపికి 0.3, జెడిఎస్‌కు 5 శాతం చొప్పున తగ్గాయి. ఇతరుల ఓట్లు 0.4 శాతం పెరిగాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద ఎలాంటి ప్రభావం చూపవని బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ స్పందించారు. అదే ఊపులో ఇక్కడా విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. గెలుపు పట్ల తమ పార్టీ ధీమాగా ఉందని బిజెపినేత బండి సంజయ చెప్పారు.

కాంగ్రెస్ సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ముస్లింలు మొత్తంగా ఆ పార్టీకి ఓటు వేశారని, అలా వేయకపోతే బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందని జెడి(ఎస్) కర్ణాటక నేత ఇబ్రహీం బహిరంగంగానే చెప్పారని కూడా బండి చెప్పారు. తమకు సీట్లు తగ్గినా ఓట్లు తగ్గలేదన్నారు. ఫలితాలపై చర్చల్లో బిజెపి ప్రతినిధులందరూ దాదాపు ఇదే విధంగా మాట్లాడారు. టివిలను వీక్షించేవారిని, పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో చదివేవారిని తప్పుదారి పట్టించేందుకు చూశారు. తరువాత కూడా మొదలు పెట్టారు. కర్ణాటకలోనే కాదు, దేశమంతటా ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాలను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకును ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి 8020 నినాదాన్ని ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే.

హిందూత్వ సంస్థలు, నోటితుత్తర నేతలు విద్వేష ప్రసంగాలను చేస్తున్న నేపథ్యంలో ఎవరూ ఫిర్యాదు చేయకున్నా పోలీసులు కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. బిజెపి సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అని తీపి కబుర్లు చెబుతుంది.అందరం కలసి ఉంటే అందరి పురోభివృద్ధి అన్నది అర్ధం. ప్రపంచంలో మొత్తం ముస్లింలు వంద మంది ఉన్నారనుకుంటే ఒక్క మన దేశంలోనే 10.9 మంది ఉన్నారు. ఈ మాత్రాన్నే భరించలేని వారు ముస్లిం జనాభా శాతం ఇంకా పెరిగే అఖండ భారత్‌ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. మన దేశ జనాభాలో తాజా అంచనా ప్రకారం 15.5 శాతం ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో ఉన్న సామాజిక తరగతిని అభివృద్ధిలో, ప్రజా ప్రాతినిధ్యంలో విస్మరిస్తే అది ప్రజాస్వామ్యం కాదు.కర్ణాటకలో జాతీయ సగటు కంటే తక్కువే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 12.92 శాతం ఉన్నారు.

కొన్ని జిల్లాల్లో అంతకంటే ఎక్కువ ఉన్నారు. తాజా ఎన్నికల గురించి హిందూ పత్రిక చేసిన విశ్లేషణలో ముస్లిం సామాజిక తరగతి ఎక్కువగా (మొత్తం జనాభాలో కాదు) ఉన్న ఐదు జిల్లాల్లో బిజెపి ఓట్ల శాతం 2023 ఎన్నికల్లో గతంతో పోలిస్తే 0.3 శాతం పెరుగుదలతో 44.5% కాగా, కాంగ్రెస్‌కు 2.1% పెరిగి 42.5 శాతంగా ఉంది. జెడి(ఎస్) 3.9 శాతం కోల్పోయి 5.5 శాతానికి పరిమితమైంది. విద్వేషాన్ని ఎంతగానో ఎక్కించబట్టే బిజెపి తన ఓట్ల శాతాన్ని స్వల్పంగానైనా గతం కంటే పెంచుకుంది. దాని ప్రమాదాన్ని నిరోధించాలని భావించబట్టే దాన్ని ఎదుర్కొనేపార్టీ కాంగ్రెసే గనుక అనేక మంది దానివైపు మొగ్గటంతో బిజెపి రాష్ర్టమంతటా చావు దెబ్బతిన్నది.
ఒకవైపు ముస్లిం మత సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు తెర వెనుక సంప్రదింపులు జరుపుతారు. కేరళలో వామపక్షాలకు వ్యతిరేకం గా క్రైస్తవులను నిలిపేందుకు నరేంద్ర మోడీ ఏకంగా చర్చ్‌కు వెళ్లారు. బిజెపి నేతలు బిషప్పులు, ఇతర మతాధికార్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులు, రంజాన్‌కు ముస్లింల ఇండ్లకు వెళ్లి కానుకలు ఇవ్వాలని, మలయాళ సంవత్సరాది సందర్భంగా వారిని ఇండ్లకు ఆహ్వానించాలని కేరళ బిజెపి ఏకంగా ఒక కార్యక్రమాన్నే ప్రకటించింది.తెలంగాణలో హిందూ ఏక్తాయాత్రలు జరుపుతున్నారు.

అందరినీ కలుపుకోవాలని చెప్పే బిజెపి తాజా కర్ణాటక ఎన్నికల్లో గతంలో జరిగిన లోక్‌సభ లేదా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కరంటే ఒక్క ముస్లింను కూడా పోటీకి ఎందుకు నిలపలేదు. ఇంతేనా మాజీ ఉప ముఖ్యమంత్రి, కెఎస్ ఈశ్వరప్ప గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ 40 శాతం కమిషన్ ఇవ్వాలని వేధించినట్లు లేఖలు రాసిన బిజెపికి చెందిన కాంట్రాక్టర్, హిందూవాహిని సంస్థ నేత సంతోష్ పాటిల్ 2022 ఏప్రిల్ 12న ఒక హోటల్లో ఉరి వేసుకొని మరణించాడు. దాంతో ఈశ్వరప్ప ఉద్యోగం ఊడింది. అతగాడు మే నెల పదవ తేదీన జరిగిన ఎన్నికల్లో ముస్లింలు తమ పార్టీకి ఒక్కఓటు కూడా వేయనవసరం లేదని బహిరంగంగా ప్రకటించాడు. అతన్ని ఏ ఒక్క బిజెపి నేత కూడా తప్పని ఖండించలేదు. మీ ఓట్లు వద్దన్న పార్టీకి వేసేందుకు ఏ సామాజిక తరగతికైనా ఆత్మగౌరవం అనుమతిస్తుందా? తమ పార్టీ విద్వేషాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ సంతుష్టీకరించిన కారణంగానే ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు, అందువల్లనే తాము ఓడినట్లు మాట్లాడే బిజెపినేతలవి నోళ్లా మరొకటా అని జనం అనుకుంటున్నారు. వారు చెప్పే దాని ప్రకారం ముస్లింలు వేస్తే వారికి లేదా ఇతర పార్టీలకు వేటికీ వేయకుండా దూరంగా ఉండాలి.

కర్ణాటక ఎన్నికల్లో ఓడిన తరువాత కూడా వాట్సాప్ యూనివర్సిటీ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం మానుకోలేదు. 90% మైనారిటీలు ఓటింగ్‌కు వచ్చారని, హిందువుల 60 శాతం దాటలేదని ఇలా ఉంటే భవిష్యత్ ఉండదంటూ ఒక ప్రచారం మొదలైంది. ఒక వెయ్యి ఓట్లు కాంగ్రెస్‌కు బదులు బిజెపికి పడితే ఆ పార్టీకి 51 సీట్లు వచ్చేవంటూ దానిలో లెక్క చెప్పారు. రెండున్నర శాతం, అంతకంటే తక్కువ ఓట్ల మెజారిటీతో మూడు పార్టీలు గెలిచిన స్థానాలు 33, గత ఎన్నికల్లో 23 ఉన్నాయి. వాటిలో గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఒకటి పెరిగి 17, బిజెపికి ఎనిమిది పెరిగి 13, జెడి(ఎస్)కు ఒకటి పెరిగి మూడు వచ్చాయి. అలాంటపుడు వెయ్యి ఓట్లుపడితే బిజెపికి 51 ఎలా వస్తాయి. చిన్న పిల్లలు, అమాయంగా ఉండే వారిని మోసపుచ్చటం తప్ప మరొకటి కాదు. కాబినెట్‌లోని 22 మందికిగాను 14 మంది మంత్రు లు ఓడారు. ఇంకా ఓడిన ప్రముఖుల్లో యెడ్యూరప్పను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రముఖ నేత, బిజెపి జాతీయ కార్యదర్శి సిటి రవి ఒకరు. బాబాబుడాంగిరి దర్గా చుట్టూ విద్వేషాన్ని రెచ్చగొట్టిన వారిలో రవి పేరు మోసినట్లు విమర్శలున్నాయి. మాజీ సిఎం సిద్ద రామయ్య ఎన్నికలు వచ్చినపుడు హిందువు, తరువాత హిందువులను ద్వేషిస్తారు.

సిద్దరాముల్లా ఖాన్ గనుక అధికారానికి వస్తే హిందువుల పని ఖతంఅని రెచ్చగొట్టిన ప్రకటనలస్పెషలిస్టు. హాస్యనటుడు బ్రహ్మానందం వెళ్లి మంత్రి సుధాకర్‌కు మద్దతుగా ప్రచారం చేసి అపహాస్యం పాలైనారు. కిచ్చా సుదీప్ అనే కన్నడ సూపర్ స్టార్ బిజెపికి ప్రచారం చేసినా పరువు దక్కలేదు. అలాంటిది బ్రహ్మానందం ఒక లెక్కా. సుధాకర్ 2019లో కాంగ్రెస్ నుంచి బిజెపికి జంప్ చేశారు. కరోనాలో తన జిల్లావారిని తప్ప ఇతరులను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఓడినవారిలో హిజాబ్ మంత్రి నాగేష్ వంటి వారున్నారు.
ఇంకా అనేక అంశాల మీద సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎక్కడా లేని విధంగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఇరవై స్థానాల్లో ప్రచారం చేస్తే 15 చోట్ల బిజెపి ఓడినట్లు వార్తలు. జై భజరంగ భళీ అని నినాదమిస్తూ ఓటు వేయాలని పిలుపునిచ్చి ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని కూడా దిగజార్చినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.తనను చూసి ఓటు వేయాలని కూడా కోరినందున బిజెపి కంటే నరేంద్ర మోడీ ఓటమిగానే జనం చూస్తున్నారు.

1989లో కాంగ్రెస్ నేత వీరేంద్ర పాటిల్ ఏలుబడిలో ఆపార్టీకి 43.76% ఓట్లు, 178 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో బిజెపికి ఓట్లు తక్కువ వచ్చినప్పటికీ సీట్లు ఎక్కువ రావటానికి కాంగ్రెస్, జెడి(ఎస్) మధ్య ఓట్ల చీలికే ప్రధాన కారణం. ఈసారి గణనీయంగా జెడి(ఎస్) ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లడంతో బిజెపి బొక్కబోర్లా పడింది. దీన్ని దాచిపెట్టి తమ ఓటమి కంటే జెడి(ఎస్)కు ఓట్లు తక్కువ రావటం గురించే బిజెపి నేతలు ఎక్కువగా చెబుతున్నారు. తమ ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకత ఉంటే తమకు గతం కంటే ఓట్లు కూడా తగ్గాలి కదా అని బిజెపి వాదిస్తోంది. దక్షిణాదిన సంఘపరివార్ తమ హిందూత్వ ప్రయోగశాలగా కర్ణాటకను ఎంచుకోవటానికి అక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయి. ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టడం, దాడులు, హిజాబ్, హలాల్ వివాదం వంటివన్నీ ప్రయోగాల్లో భాగమే. కులం, మతం, ప్రాంతీయ విద్వేషాల పులుల మీద ఒకసారి జనాన్ని ఎక్కించిన తరువాత వారు వాటి నుంచి అంత తేలికంగా దిగలేరు. విష ప్రభావానికి గురైన కొన్ని తరాలు చివరి వరకు అలాగే కొనసాగుతాయి.

ఐరోపాలో ఫాసిజం, నాజీజాలను, యూదుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టిన శక్తులు సృష్టించిన మారణహోమం, రెండు ప్రపంచ యుద్ధాలను తెచ్చిన సంగతి తెలిసిందే. అవి అంతరించినా, అవి ముందుకు తెచ్చిన దుర్మార్గ భావజాలాన్ని నయా నాజీలు, ఫాసిస్టులు అందిపుచ్చుకుంటున్న వర్తమానం మన కళ్ల ముందు ఉంది. అలాంటి శక్తుల స్ఫూర్తితో మన దేశంలో ఉనికిలోకి వచ్చిన కాషాయ దళాలు కూడా అలాంటి విష బీజాలనే నాటాయి. గతంలో యూదులను బూచిగా చూపి విద్వేషాన్ని రెచ్చగొడితే, ఇప్పుడు ఇస్లాం మతం వారిని ప్రపంచ శత్రువులుగా చూపి అదే చేస్తున్నారు. కసాయిని నమ్మి వెంట వెళ్లిన గొర్రె లోకోక్తి గురించి మన పెద్దలు చెప్పిన సంగతి తెలిసిందే. నాజీల నిజస్వరూపం తెలుసుకొనేందుకు జర్మన్లు, ఐరోపా వారికి చాలా కాలం పట్టింది. మన దేశంలో కూడా అలాంటి శక్తులను గుర్తించే క్రమం ప్రారంభమైంది.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News