బెంగళూరు: కర్నాటకలో ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రభుత్వాన్ని నడిపించే బాద్యత చేపడతానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి పరమేశ్వర మంగళవారం ప్రకటించారు. పార్టీ కోసం తాను చేసిన సేవలు అధిష్టానానికి తెలుసునని, ముఖ్యమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని మాజీ కెపిసిసి అధ్యక్షుడైన పరమేశ్వర చెప్పారు.
ప్రభుత్వానికి సారథ్యం వహించవలసిందిగా పార్టీ అధిష్టాననం తనను ఆదేశిస్తే బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధమని మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా అయిన పరమేశ్వర చెప్పారు. పార్టీ అధిష్టానం పట్ల తనకు విశ్వాసం ఉందని, తనకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తాను కూడా 50 మంది శాసనసభ్యులను తీసుకెళ్లి నినాదాలు ఇప్పించగలనని, కాని పార్టీ క్రమశిక్షణ తనకు అత్యంత ప్రధానమని ఆయన అన్నారు. తమలాంటి వ్యక్తులు కొన్ని విషయాలను పాటించకపోతే పార్టీలో క్రమశిక్షణ మిగలదని ఆయన చెప్పారు.