Monday, November 18, 2024

బుడతడిని భుజాలపై ఎత్తుకొని ఆడించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎవరు ఎంత పెద్ద హోదాల్లో ఉన్నా పిల్లల్ని ఆడించాలంటే వారి వయసుకు వెళ్లిపోవాల్సిందే. పసి పిల్లల బోసి నవ్వులకు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. వారి చేష్టలు ముద్దు ముద్దు మాటలకు మనం కాదనకున్నా, చేతులు ఆ చిన్నారులను ఎత్తుకుని ముద్దాడేందుకు తహతహలాడుతాయి. చంటి బిడ్డల్ని ఆడించడం ఎవరికి మాత్రం నచ్చదు. ఎంత బిజీలో ఉన్నా ఆ చిన్నారులతో గడిపే సమయం అత్యంత అద్భుతంగానే ఉంటుంది. తాజాగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ కూడా పిల్లల్ని ఆడించిన వీడియో బయటికి వచ్చింది. ఇటీవల లండన్ పర్యటనలో భాగంగా యూకెలో ఎన్నారై బిఆర్‌ఎస్ విభాగం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకె అధ్యక్షు డు రత్నాకర్ ఇంటికి మంత్రి కెటిఆర్ వెళ్లారు.

మంత్రి కెటిఆర్ తన ఇంటికి రావడంపై రత్నాకర్ సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన తన ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. ‘దయ గల దేవుడు అయి ఉండి, మన ప్రార్థనలు విన్నప్పుడు మన జీవితంలో కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి. మేము ఎంతగానో అభిమానించే మా డైనమిక్ లీడర్ కెటిఆర్ అన్న లండన్‌లోని మా ఇంటికి వచ్చారు. మా కుమారుడు రణవ్‌ని ఆశీర్వదించారు. ఈ అద్భుతమైన సందర్భానికి కృతజ్ఞతని వ్యక్త పర్చడానికి నాకు మాటలు రావడం లేదు. థ్యాంక్యూ రామన్నా” అని మంత్రి కెటిఆర్‌ను ట్యాగ్ చేస్తూ రత్నాకర్ ట్వీట్ చేశారు. అందులో మంత్రి కెటిఆర్ తన ఇంటికి వచ్చిన వీడియోని కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా నెలల బాబు అయిన రత్నాకర్ కుమారుడు రణవ్‌ని మంత్రి కెటిఆర్ బాగా ఆడించారు. కెటిఆర్ ఆ బాలుడిని భుజంపై వేసుకుని నిద్రపుచ్చడానికి ప్రయత్నించారు.

తన ఇంటికి కెటిఆర్ వచ్చి తన కుటుంబానికి ఎనలేని సంతోషాన్ని కలిగించిన మంత్రి కెటిఆర్‌కు రత్నాకర్ కృతజ్ఞతలు తెలిపారు. బాస్, లీడర్, బ్రదర్ లవ్ అనే హ్యాష్‌ట్యాగ్‌లు యాడ్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆ వీడియోను మంత్రి కెటిఆర్ కూడా రీట్వీట్ చేశారు. ఎన్నారైలు చూపుతున్న ప్రేమకు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రి కెటిఆర్ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం అంటూ రీట్వీట్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News