నాసిక్: దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాసికా త్రయంబకేశ్వరుడి ఆలయంలోకి ఇతర మతాలకు చెందిన కొందరు ప్రవేశించడానికి ప్రయత్నించడం ఇప్పుడు వివాదంగా మారింది. అయితే ఇదంతా రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి హిందుత్వ పేరుతో గ్యాంగులను ఏర్పాటు చేయడానికి పన్నిన కుట్ర తప్ప వేరొకటి కాదని ఉద్ధవ్ థాకరే శివపేన వర్గం( యుబిటి)కి చెందిన నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం ఆరోపించారు.అంతకు ముందు సకాల్ హిందూ సమాజ్‌కు చెందిన కార్యకర్తలు ఆలయాన్ని గోమూత్రంతో శుద్ధిచేసి ప్రత్యేక హారతులు జరిపారు. కాగా శనివారం రాత్రి వేర్వేరు మతాలకు చెందిన కొంతమంది త్రయంబకేశ్వర్ ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారని, అయితే సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకున్నారని ఆలయ అధికారులు అంటున్నారు.
అయితే అధికారులు చెబుతున్నట్లుగా ఎవరు కూడా బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించలేదని, అయితే కొంతమంది ఆ రోజు ప్రాచీనకాలంనుంచి వస్తున్న సంప్రదాయాన్ని మాత్రమే పాటించారని విలేఖరుల సమావేశంలో మాట్లాడిన రౌత్ చెప్పారు. ‘హిందూ దేవుళ్లకు ధూపాన్ని సమర్పించే సంప్రదాయం ఉంది. సూఫీ సన్యాసి గులబ్ షా సందాల్‌కు చెందిన వందేళ్ల నాటి సంప్రదాయం ఇది. అలాగే భక్తులు త్రయంబకేశ్వర ఆయలం మెట్ల వద్ద ధూపాన్ని సమర్పించారు. ఆలయ ప్రవేశద్వారాన్ని సందర్శించి వెళ్లడం ద్వారా వేరే మతానికి చెందిన భక్తులు కేవలం ఈ సంప్రదాయాన్ని పాటించారని రౌత్ చెప్పారు. ఇలాంటి సంప్రదాయాన్ని కేవలం మహారాష్ట్రలోనే కాదు, దేశమంతటా పాటించడం జరుగుతోందని, చివరికి ప్రధాని సైతం అజ్మీర్ షరీఫ్ లాంటి దర్గాలను సందర్శించారని రౌత్ చెప్పారు.
‘నాకు తెలిసిన సమాచారం ప్రకారం పోలీసులకు ఫిర్యాదు లేఖ ఇవ్వాలని ఆలయ అధికారులను బలవంతం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అనౌతిక మార్గంలో అధికారాన్ని దక్కించుకుంది. దానికి ప్రజల మద్దతు లేదు. హిందుత్వ పేరుతో గ్యాంగులను సృష్టించి మహారాష్ట్రలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర ఇదని నాకు అనిపిస్తోంది’ అని ఆయన చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తుకు హోంమంత్రి కూడా అయిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్)ను ఏర్పాటు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు.గత అరవై ఏళ్లలో రామనవమి నాడు ఒక్క హింసాత్మక సంఘటన కూడా జరగలేదని, అయితే ఈ ఏడాది అల్లర్లు జరిగాయని ఆయన అంటూ ఆ సంఘటనలపై కూడా సిట్ వేస్తారా? అని ప్రశ్నించారు. కాగా ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.