విడాకుల కేసుల్లో ప్రేమ వివాహాలవే అధికం
ఓ జంట తగువు నేపథ్యంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు
రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ప్రస్తావన
న్యూఢిల్లీ: ప్రేమ పెళ్లిళ్లలో అధికం చివరికి విడాకులకే దారితీస్తున్నాయా? అవుననే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశంలో ఎక్కువగా విడాకుల కేసులు ప్రేమ చేసుకున్న వారి నుంచే దాఖలు అవుతున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పేర్కొంది. తమ ముందుకు వచ్చిన ఓ జంట విడాకుల కేసు విచారణ దశలో న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, సంజయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం ప్రేమ పెళ్లిళ్లు ఈ విధంగా విడిపోవడానికి ఎందుకు దారితీస్తున్నాయని ధర్మసందేహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి తాను క్రిస్టియన్ మతం స్వీకరించాలని అనుకుంటున్నానని అయితే దీనిపై వైవాహిక తగవు ఏర్పడిందని పేర్కొంటూ ట్రాన్స్ఫర్ పిటిషన్ వేశారు.
పరిశీలించిన ధర్మాసనం ఈ కేసులో కూడా జంటది ప్రేమ వివాహమే అని తమకు తెలిసిందని , ఎక్కువ విడాకులు కేసులు ప్రేమ పెళ్లిళ్ల వారివే వస్తున్నాయని తెలిపింది. ఈ నెల 1వ తేదీన ఈ కేసుకు సంబంధించి ఈ విషయంలో మధ్యవర్తిత్వానికి సూచించింది. అయితే ఈ వ్యక్తి దీనికి సమ్మతించలేదు. దీనితో ఆయన సమ్మతి లేకుండానే విడాకులు మంజూరు చేస్తామని కోర్టు తెలిపింది. ఇటీవలే రాజ్యాంగ ధర్మాసనం విడాకుల మంజూరీ, తక్షణ చర్యకు అవకాశం కల్పిస్తూ తీర్పు వెలువరించిన విషయాన్ని ఈ ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్లకు తెలిపింది. త న్యాయమూర్తి ఎస్కె కౌల్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల విడాకుల గురించి కీలక వ్యాఖ్యలతో రూలింగ్ వెలువరించింది.
ఇక కలిసి ఉండటం కుదరదనుకునే దశలో, విడిపోవడం తప్ప మరో దారిలేదని నిర్థారణకు వచ్చిన దశలో వివాహం రద్దు ఒక్కటే సవ్యమైన పరిష్కారం అవుతుందని తెలిపింది. పరస్పర సమ్మతి నమ్మకం కీలకం అయిన వివాహాల విషయంలో ఇవి బెడిసికొట్టినప్పుడు ఈ బంధానికి అర్థం లేదని పేర్కొంది. కుటుంబ న్యాయస్థానాల పరిధితో నిమిత్తం లేకుండా దంపతుల సమ్మతి ఉంటే ఆరు నెలల నిరీక్షణ కాలంతో సంబంధం లేకుండా వెంటనే విడాకులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తనకున్న విశేషాధికారాన్ని రాజ్యాంగంలోని 142(1) పరిధిలో వినియోగించుకోవచ్చునని తెలిపింది.