హైదరాబాద్ : 54 రోజుల చిన్నారికి వచ్చిన ఆరోగ్య సమస్య ఎస్‌సి అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కదిలించింది. జగిత్యాల జిల్లా యండ్లపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఇప్పల కమలాకర్, మమత దంపతులు తమ కుమారుడికి వచ్చిన గుండె సంబంధిత వ్యాధిని తీవ్ర ఆవేదనతో మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. గురువారం చిన్నారిని తీసుకొని హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగాణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిశారు. చిన్నారి ఆరోగ్య సమస్యపై స్పందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో వారి సమక్షంలోనే ఫోన్ లో మాట్లాడారు.
Also Read: బిజెపిని వీడడం లేదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చిన్నారికి వెంటనే అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరం అయిన ఆపరేషన్ చేయాలని సూచించారు. వెంటనే కార్యాలయ సిబ్బందిని వారి వెంట నీలోఫర్ ఆసుపత్రికి ఇచ్చి పంపించారు. చిన్నారి వైద్యంపై మంత్రి స్పందించిన తీరుతో ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారికి వచ్చిన గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న తమకు మంత్రి ఇచ్చిన భరోసా ధైర్యాన్నిచ్చిందని ఆ దంపతులు చెప్పారు. తమ చిన్నారికి వైద్య సేవలు అందించేందుకు అడగ గానే సహకరించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు