హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది జూన్ 15నాటికే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రతి ఏడాది మే 20నాటికి అండమాన్ సముద్రం ,దక్షిణ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూన్ ఒకటి నాటికి ఇవి కేరళ రాష్ట్రాన్ని తాకుతాయి. అప్పటి నుంచే దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలవుతుంది. అయితే ఈ ఏడాది రుతుపవనాలు మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4నాటికి కేరళను తాకే అవకాశం ఉందని రెండు రోజుల కిందటే భారతవాతావరణ శాఖ వెల్లడించింది. గత ఏడాడి మే నెల 20వ తేదికంటే వారం రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి.
Also Read: విఆర్‌ఏలను రెగ్యులరైజ్ చేయడంపై ట్రెసా హర్షం
ఈ సారి మాత్రం ఒకటి రెండు రోజులు ముందుగానే ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేసింది. శుక్రవారం లోగా ఇవి దక్షిణ అండమాన్ సముద్రం ,నికోబార్ దీవులకు విస్తరించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 22నాటికి అండమాన్ ,నికోబార్ దీవులంతటికీ విస్తరించే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. మరో వైపు రుతుపవనాల ప్రవేశానికి సూచికగా మూడురోజులనుంచి అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 4నాటికి రుతుపవనాలు కేరళను తాకనుండటంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ఉంటుందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది.
వాస్తవానికి రుతుపవనాలు కేరళను తాకిన పదిరోజుల్లోగా రాయలసీమ మీదుగా ఇవి తెలుగురాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. అనంతంర వారం రోజుల్లోగా తెలంగాణ అంతటా ఇవి విస్తరిస్తాయి. అంతా అనుకూలిస్తే జూన్ 10కి బదులు15 నాటికంతా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో తెలుగు రాష్ట్రాలకు సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు అంచనావేస్తున్నారు.