Monday, November 25, 2024

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్
ఆర్ అండ్ డి కేంద్రాన్ని విస్తరించనున్న మెడ్‌ట్రానిక్
రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో విస్తరణ ప్రణాళికలు
5 సంవత్సరాలలో 1500లకు పైగా ఉద్యోగాల కల్పనకు కంపెనీ సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్ కేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్‌ట్రానిక్స్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. 3 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో మెడికల్ డివైజెస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో ఆ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ విస్తరణ ప్రణాళికల గురించి వివరించారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములం అవుతున్నందకు సంతోషంగా ఉందని మెడ్‌ట్రానిక్ సర్జికల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మైక్ మరీనా అన్నారు.

మానవ జీవితాలను మార్చే టెక్నాలజీ ఆవిష్కరణలకు భారతదేశం నయా గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యతను గుర్తించిన తర్వాతనే తాము ఈ పెట్టుబడి ప్రకటన చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందకు గర్వంగా ఉందని మైక్ మరీనా చెప్పారు.
లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం అన్నారు. మెడ్‌ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ సైట్ లీడర్ దివ్య ప్రకాష్ జోషి. హెల్త్‌కేర్ టెక్నాలజీలో ఆవిష్కరణలు, పురోగతికి ఆర్ అండ్ డిలో తాము పెడుతున్న పెట్టుబడి పునాది అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో మా పోటీ ప్రపంచంతోనే : కెటిఆర్
వైద్య పరికరాల ఉత్పత్తికి భారతదేశంలో అపారమైన మార్కెట్ ఉందని గుర్తించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తమ పోటీ ప్రపంచంతోనే అని అన్నారు. లైఫ్ సైన్సెస్,హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న పట్టుకు, పెరుగుతున్న ప్రాధాన్యతకు మెడ్‌ట్రానిక్ తాజా పెట్టుబడే నిదర్శనమని వ్యాఖ్యానించారు. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తీసుకున్న చర్యలను ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్ వివరించారు. రాష్ట్రంలో హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగం వృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటు మెడ్‌ట్రానిక్స్ విస్తరణ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ సిఇఒ శక్తి ఎం నాగప్పన్ పాల్గొన్నారు.

ఐర్లాండ్‌లోని మెడ్‌ట్రానిక్ ప్రధాన కార్యాలయం
ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో మెడ్‌ట్రానిక్ ప్రధాన కార్యాలయం ఉంది. 150 కంటే ఎక్కువ దేశాలలో 90 వేలకు పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. కార్డియాక్ పరికరాలు, సర్జికల్ రోబోటిక్స్, ఇన్సులిన్, సర్జికల్ టూల్స్, పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ వంటి 70 రకాల ఆరోగ్య సమస్యల చికిత్సలో ఉపయోగించే పరికరాల ఆవిష్కరణలు ఈ కంపెనీ సొంతం..మరింత సమాచారం కోసం www.Medtronic.com వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News