Thursday, January 23, 2025

జూన్15 నాటికే తెలంగాణకు రుతుపవనాలు

- Advertisement -
- Advertisement -

జూన్15 నాటికే తెలంగాణకు రుతుపవనాలు
నేడు దక్షిణ అండమాన్ దీవుల్లోకి ప్రవేశం
మనతెలగాణ/హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది జూన్ 15నాటికే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రతి ఏడాది మే 20నాటికి అండమాన్ సముద్రం ,దక్షిణ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూన్ ఒకటి నాటికి ఇవి కేరళ రాష్ట్రాన్ని తాకుతాయి. అప్పటి నుంచే దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలవుతుంది.

అయితే ఈ ఏడాది రుతుపవనాలు మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4నాటికి కేరళను తాకే అవకాశం ఉందని రెండు రోజుల కిందటే భారతవాతావరణ శాఖ వెల్లడించింది. గత ఏడాడి మే నెల 20వ తేదికంటే వారం రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. ఈ సారి మాత్రం ఒకటి రెండు రోజులు ముందుగానే ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేసింది. శుక్రవారం లోగా ఇవి దక్షిణ అండమాన్ సముద్రం ,నికోబార్ దీవులకు విస్తరించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ నెల 22నాటికి అండమాన్, నికోబార్ దీవులంతటికీ విస్తరించే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. మరో వైపు రుతుపవనాల ప్రవేశానికి సూచికగా మూడురోజులనుంచి అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 4నాటికి రుతుపవనాలు కేరళను తాకనుండటంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ఉంటుందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. వాస్తవానికి రుతుపవనాలు కేరళను తాకిన పదిరోజుల్లోగా రాయలసీమ మీదుగా ఇవి తెలుగురాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. అనంతంర వారం రోజుల్లోగా తెలంగాణ అంతటా ఇవి విస్తరిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News