కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని ముఖ్యమంత్రి నిజం చేశారు
రాజ్యసభ సభ్యుడు, సినీ రచయిత విజయేంద్రప్రసాద్
హైదరాబాద్: పట్టుదల, ఆకుంఠీత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను చేపడుతూ, కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిజం చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి పాన్వరల్డ్ సినిమాలను కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ శుక్రవారం తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. వారసత్వ సాంస్కృతిక వైభవం, అధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం ఉందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఇప్పుడే ఒక అద్భుతం చూశాను.
వేరే ఎవరూ చెప్పినా నమ్మేవాన్ని కాదు స్వయంగా చూశాను. అతి తక్కువ సమయంలో, అతి తక్కువ బడ్జెట్లో జనం కోసం ఒక గొప్ప నిర్మాణం చేశారు. నిజంగా చెప్పాలంటే కెసిఆర్ ఒక మిరాకిల్ క్రియేట్ చేశారని, అది ఆయనకే సాధ్యమని విజయేంద్ర ప్రసాద్ కితాబునిచ్చారు. పది నెలల సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంతకు మించిన ఒక గొప్ప ప్రజా సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయమన్నారు. ఇది అందరికీ ఉపయోగపడే నిర్మాణమని, ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి జెట్ స్పీడ్తో పరుగులు పెడుతుందన్నారు. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉన్నారని విజయేంద్ర ప్రసాద్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, సినీ ప్రొడ్యూసర్ కొణతం లక్ష్మణ్, డైరెక్టర్ మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.