సిటిబ్యూరోః దేవాలయాల్లో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు నిందితులను సరూర్‌నగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.6,650 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన తలారి మనోజ్‌కుమార్ అలియాస్ మనోజ్ క్యాటరింగ్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. గద్వాల్ జిల్లా, కాకులరం గ్రామానికి చెందిన బండారి శామ్యూల్ క్యాటరింగ్ పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి హస్తినాపురంలో ఉంటున్నారు. ఇద్దరు నిందితులు పలు నేరాలు చేయడంతో పోలీసులు గతంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మనోజ్‌పై సరూర్‌నగర్, ఎల్‌బి నగర్, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
బండారి శామ్యూల్‌పై కాంచన్‌బాగ్, హయత్‌నగర్, సైదాబాద్, సరూర్‌నగర్ పిఎస్‌లో కేసులు నమోదయ్యాయి. ఇద్దరు నిందితులు కలిసి ఈ నెల 16వ తేదీన హనుమాన్, దుర్గామాత గుడిలోని హుండీలోని డబ్బులను చోరీ చేశారు. దేవాలయం నిర్వాహకులు, వాచ్‌మెన్ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవాలయంలోని సిసి కెమెరాలను పరిశీలించగా నిందితులను గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితులు సరూర్‌నగర్ ఓల్డ్ పోస్ట్‌ఆఫీస్ ఏరియాలో తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.