భాఘ్‌పట్ : ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగం ఆశ చూపి ఓ 35 ఏండ్ల యువతిపై నలుగురు యువకులు పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. సొంత గ్రామానికి చెందిన యువకుల చేతిలో ఈ మహిళ బాధితురాలు అయింది. శుక్రవారం స్థానిక పోలీసులు ఈ ఘటన గురించి తెలియచేశారు. విడాకులు తీసుకుని ఉంటున్న మహిళకు స్థానిక యువకులు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. సొంత ఊరివారు కావడంతో వీరిని ఇంటికి రానిచ్చిన తరువాత యువకులు సౌరభ్, కమల్, శుభం, సాగర్ ఆమె మద్యం తాగించారు. డ్రగ్ కలిపిన పానీయం కూడా ఇవ్వడంతో ఆమె స్పృహ తప్పిన దశలో వీరు ఈమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ మొత్తం ఘటనను సెల్‌ఫోన్‌తో వీడియోగా మల్చారు. ఆ తరువాత విషయం బయటకు చెప్పవద్దని , వీడియోను లీక్ చేస్తామని బెదిరిస్తూ ఫిబ్రవరి 14 నుంచి తరచూ వీరు ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నట్లు ఇప్పుడు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు క్రమంలో వెల్లడైందని పోలీసులు ఇప్పుడు తెలిపారు. వీరు ఆమె ప్రతిఘటించినట్లు అయితే తీవ్రంగా కొట్టి తమ కామవాంఛ తీర్చుకునే వారని, దిక్కులేని స్థితిలో మూడు నెలలుగా చిత్రవధను అనుభవిస్తూ వచ్చిన మహిళ చివరికి సాహసించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దాఖలు అయింది. సొంత ఊరి మహిళపై పైశాచికంగా నమ్మించి మోసగించిన యువకులు ఫరారీలో ఉన్నట్లు తెలిసింది.