తెలంగాణకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల క్యూ
రూ.1250కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ. హైదరాబాద్‌లో
సాఫ్ట్వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటుకు ఫ్రెంచ్అమెరికన్ కంపెనీ టెక్నిప్ ఎఫ్ఎంసి
సమ్మతి. 3500 మందికి ఉద్యోగావకాశాలు.. మరో వెయ్యి మందికి ఉపాధి కల్పించే
మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ ఏర్పాటుకు అంగీకారం. హైదరాబాద్‌లో తన కార్యకలాపాల
విస్తరణకు ముందుకొచ్చిన గ్లోబల్ కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సంస్థ అలియంట్. మరో 9వేల
కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని సంస్థ సిఇఒ స్పష్టీకరణ. ఐటి మంత్రి కల్వకుంట్ల
తారకరామారావును కలిసిన అనంతరం ప్రకటన
సాంప్రదాయ, పునరుత్పాదక ఇంధన రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ఫ్రెంచ్-అమెరికన్ ఆయిల్-గ్యాస్ దిగ్గజ కంపెనీ టెక్నిప్ ఎఫ్ఎంసి గ్లోబల్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో టెక్నిప్ ఎఫ్ఎం సి కంపెనీ ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది. హ్యూస్టన్‌లోని టెక్నిప్ ఎఫ్ఎంసి క్యాంపస్‌లో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రస్ డాల్, ఇండియా హెడ్-మేనేజింగ్ డైరెక్టర్ హౌ సిలా తివారీతో పాటు ఇతర అధికారులు కెటిఆర్‌ను కలిశారు.
తన సాఫ్ట్వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్‌తో పాటు ప్రెసిషన్ ఇంజనీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని హైదరాబాద్‌లో ప్రారంభించడానికి ఈ సమావేశంలో టెక్నిప్ ఎఫ్ఎంసి నిర్ణయం తీసుకుంది. 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయబోయే మరో మ్యానుఫాక్చరింగ్ సెంటర్‌ను కూడా ఏర్పా టు చేయడానికి హైదరాబాద్‌నే ఆ కంపెనీ ఎంచుకుంది. అదనంగా ఏర్పటు చేయబోయే ఈ కేంద్రంతో రాబోయే 5 ఏళ్లలో 1000 ఉద్యోగాలను కంపెనీ కల్పించబోతుంది. తొ లి దశలో 1250 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతుంది. 5400 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులను హైదరాబాద్ కేంద్రం గా చేయబోతుంది.
ఎఫ్ఎంసి టెక్నాలజీస్, టెక్నిప్‌ల విలీనంతో ఏర్పడిన టెక్నిప్ ఎఫ్ఎంసి సంస్థ ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో దాదాపు 30,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విద్యుత్ ప్రాజెక్టులు,టెక్నాలజీ, సిస్టం, సర్వీసెస్ రంగంలో టెక్నిప్ ఎఫ్ఎంసికి అంతర్జాతీయంగా మంచి పేరుంది. గ్రీన్హౌస్ గ్యాస్ తొలగింపు, పునరుత్పాదక ఇంధన తయారీ, హైడ్రోజన్ ఆధారిత ఇంధన ఉత్పత్తి ఆవిష్కరణల్లో ముందంజలో ఉంది. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పెట్టుబడుల ఎన్ఆర్ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణు వర్ధన్ రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి ఆత్మకూరి, ఏరోస్పేస్, డిఫన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పిఎ పాల్గొన్నారు.