ప్రపంచంలో శస్త్రచికిత్స చేయించుకున్న అతిపిన్న వయసు రోగిగా రికార్డు
న్యూఢిల్లీ : మూడు నెలల పసివాడికి మూత్రపిండాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించే లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సను ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించ గలిగారు. ఈ మూడు నెలల పసివాడు ప్రపంచం మొత్తం మీద శస్త్రచికిత్స చేయించుకున్న అతిపిన్న వయసు రోగిగా ఈ ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రి ఆదివారం ప్రత్యేక ప్రకటన చేయడం విశేషం. ఎయిమ్స్ (ఎఐఐఎమ్‌ఎస్) పిడియాట్రిక్స్ విభాగం డాక్టర్లు ఈ పసిబాలుడికి ద్వైపాక్షిక లాపరోస్కోపిక్ పైలోప్లాస్టీ ప్రక్రియలో శస్త్రచికిత్సను నిర్వహిచారు.
ఈ ప్రక్రియలో శరీరంపై కోత కానీ, కుట్లు కానీ అతి కనీస స్థాయిలో ఉంటాయి. పైలోప్లాస్టీ శస్త్రచికిత్స అంటే మూత్రపిండం నుంచి మూత్రం బయటకు వచ్చిన చోట మూత్ర నాళంలో ఏర్పడిన అడ్డంకిని సరిచేసే ప్రక్రియ. ఈ పరిస్థితిని యురెటెరో పెల్విక్ జంక్షన్ అడ్డంకిగా పిలుస్తారు. దీనివల్ల మూత్రం సరిగ్గా ప్రవహించదు. ఈ పరిస్థితి ఒక మూత్ర పిండం లోనే సాధారణంగా ఏర్పడుతుంది. కానీ ఈ పసివాడిలో రెండు మూత్ర పిండాలకు సమస్య ఏర్పడింది. ఇది పుట్టుక తోనే వచ్చింది.
ఈ శస్త్రచికిత్స ప్రక్రియ డిసెంబర్ లోనే నిర్వహించారు. మూడు రోజుల తరువాత డిశ్చార్జి చేశారు. సర్జరీ జరిగిన మూడు నెలల తరువాత ఇదెంతవరకు విజయవంతం అయిందో , మూత్రపిండాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎంతవరకు సవ్యంగా ఉందో నిర్ధారించుకోడానికి రెనోగ్రామ్ పరీక్ష చేసినట్టు పిడియాట్రిక్స్ విభాగం అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ విశేష్ జైన్ వెల్లడించారు. అత్యాధునికంగా పిల్లల శస్త్రచికిత్స నిర్వహణలోతగిన భద్రత తీసుకోవడం, అలాగే మత్తు మందు ఇవ్వడం (అనస్తీషియా ఇవ్వడం )లో ఎయిమ్స్ వైద్యుల నైపుణ్యాన్ని ఈ శస్త్రచికిత్స నిరూపించిందని చెప్పారు.