బెంగళూరు ః స్థానిక రోడ్లపై ప్రముఖుల రాకపోకల దశలో ట్రాఫిక్ నిలిపివేత ప్రోటోకాల్‌ను ఎత్తివేయాలని పోలీసు అధికారులను కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. రద్దీగా ఉండే సమయాలలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర వివిఐపిల కాన్వాయ్‌ల రాకపోకల నేపథ్యంలో చాలా సేపు ట్రాఫిక్ నిలిపివేత జరుగుతోంది. దీని వల్ల సాధారణ పౌరులు చాలా ఇక్కట్లకు గురవుతున్నందున స్పందించిన సిఎం వెంటనే ఈ జీరోట్రాఫిక్ పద్ధతిని తీసివేయాలని తెలిపారు.
తాను ప్రయాణించేటప్పుడు కూడా ఈ విధానం అమలులో పెట్టరాదని తాను అధికారులను ఆదేశించినట్లు ట్వీటు వెలువరించారు. ప్రమాణస్వీకారం మరుసటి రోజు నుంచే తన కాన్వాయ్‌కు ఈ సౌకర్యం నిలిపివేతకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన సిఎం సంబంధిత విషయాన్ని పోలీసు అధికారులకు అందించారు. తనకు పుష్పగుచ్ఛాలు, శాలువాలు బహుకరించరాదని, వీటిని స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అభిమానంతో ఓ పుస్తకం ఇస్తే చాలునని, ప్రజల అభిమానం ఉంటే చాలునని తెలిపారు.