ఈ బాలికకు గర్భస్రావమే దారి
కేరళ హైకోర్టు కీలక తీర్పు
సోదరుడి వాంఛతో చెల్లె తల్లిదశకు
బిడ్డకు జన్మనిస్తే పలు చిక్కుల ఊబికే
తిరువనంతపురం: ఓ మైనర్ బాలిక సోదరుడి దుశ్చర్యతో గర్భం దాల్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఏడునెలల గర్భిణి గర్భవిచ్ఛిత్తికి కేరళ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఇది అవాంఛనీయ, అక్రమ గర్భం, బాలికకు తలెత్తిన దుస్థితిని మానవీయ కోణంలో ఆలోచించాల్సి ఉన్నందున ఈ గర్భవిచ్ఛిత్తితో తలెత్తే పలు సామాజిక, వైద్యపరమైన సంక్లిష్టతలను పట్టించుకోవల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు కేరళ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. తన గర్భస్రావానికి ఈ బాలిక దాఖలు చేసుకున్న పిటిషన్‌కు అనుకూలంగా వ్యవహరించింది. ఈ బాలిక తండ్రి బిడ్డ గర్భస్రావానికి మొరపెట్టుకున్నందున, బాలిక కూడా దీని నుంచి విముక్తి కోరినందున ఇందుకు తాము సమ్మతిస్తున్నట్లు జియాద్ రెహ్మన్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ బాలిక ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు అంతకు ముందు ఏర్పాటు అయిన వైద్య బృందం నివేదికను పరిశీలించింది. దీని ప్రాతిపదికన సానుకూలంగా స్పందించింది.
ఇప్పుడు గర్భవిచ్ఛిత్తి జరగకపోతే ఈ 15 ఏండ్ల బాలికకు సామాజికంగా, మానసికంగా తీవ్రస్థాయి పరిణామాలు ఎదురుకావచ్చునని, ఈ దశలో ఈ 32 వారాల గర్భం కొనసాగింపులో ఔచిత్యం లేదని తెలిపారు. సోదరుడి వల్ల ఈ బాలిక గర్భం దాల్చిన ఈ ఘటన వల్ల ఈ కుటుంబం పలు రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ దశలో గర్భవిచ్ఛిత్తి అనివార్యం, మరో దారి లేదని ధర్మాసనం తెలిపింది. ఇక వైద్యపరంగా చూస్తే బాలిక ఇప్పటి దశలో గర్భస్రావానికి అవసరం అయిన మానసిక బలం, శారీరక శక్తితో ఉందని వెల్లడైంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి గురించి చెప్పలేమని పేర్కొన్న ఈ బాలిక తల్లి కాకుండా చేయాల్సి ఉందని తెలిపింది. బాలికకు గర్భస్రావానికి సంబంధించి తగు ఏర్పాట్లు చేయాలని ఈ దశలో జిల్లా అధికార యంత్రాంగానికి, వైద్య విభాగానికి ఆదేశాలు వెలువరించారు.