బలవర్థక బియ్యం పేరిట ఆర్బాటం
ప్రధాని మోడీ అపరిపక్వ,
అశాస్త్రీయ నిర్ణయం
నిపుణులు హెచ్చరించినా
సాగిన విఫల పథకం
న్యూఢిల్లీ : పేదలు తమకు తినడానికి బియ్యం ఇవ్వమంటే బియ్యం ఎందుకు ‘బలవర్థక బియ్యం’ అందిస్తామని, 2024 నాటికి దేశంలోని సగం మందికి ఈ బియ్యం భోజనమే అందుతుందని ప్రధాని చేసిన ప్రకటన అనుచితమే కాకుండా, వాస్తవికంగా అశాస్త్రీయం అయింది. ప్రధాని మోడీ 2021 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి పంద్రాగస్టు ప్రసంగం చేస్తూ బలవర్థక బియ్యం హామీ ఇచ్చారు. ప్రజలలోని రక్తహీనత, పోషకాహార లోపాలను నివారించేందుకు ఈ ఫోర్టిఫైడ్ రైస్ పంపిణి సరైన దారి అవుతుందని తెలిపారు. అయితే పేదలకు ఈ బియ్యం పంపిణీ వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు గురించి అందిన అనేక అంతర్గత అభ్యంతరాలను మోడీ ప్రభుత్వం బేఖాతరు చేసింది. సాధారణంగా ఏదైనా కొత్త పథకం తీసుకువచ్చినప్పుడు నమూనాత్మక రీతిలో ఫలితాలను బేరీజు వేసుకోవల్సి ఉంటుంది.
ప్రత్యేకించి మనిషి దైనందిన జీవనక్రమం, ఆరోగ్యపరమైన చట్రానికి సంబంధించిన ఆహార వలయాన్ని దెబ్బతీసేలా ఈ బలవర్థక బియ్యం వల్ల ఫలితాలు ఉంటాయని పలు పైలెట్ ప్రాజెక్టుల నివేదికలు హెచ్చరించాయి. అయితే ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. ముందుగా ఇటువంటి బియ్యంతో తలెత్తే ఆరోగ్య దుష్ప్రభావాల గురించి, మరీ ప్రధానంగా బాలల్లో ఏర్పడే వైపరీత్యాలను విశ్లేషించుకోకుండా ఈ పథకం ప్రవేశపెట్టరాదని, దీనిని సార్వత్రికం చేయరాదనే అంతర్గత నివేదికలను బేఖాతరు చేశారు. ఎర్రకోట సభలో తన ముందు ఉన్న ప్రజలను తనదైన రీతిలో ఆకట్టుకోవాలనే తాపత్రయంతో ప్రధాని ఈ బియ్యం గురించి చేసిన ప్రకటన అపరిపక్వ ఆలోచన దీనితో పాటు ఆరోగ్య చేటు పరిణామాల హెల్త్ పాలసీకి దారితీసింది. దేశంలో బలవర్థక బియ్యం పంపిణీ విధానంతో ముందుకు సాగాలనే నిర్ణయం సంబంధిత పత్రాలను రిపోర్టర్స్ కలెక్టివ్ సమీకరించింది.
ఇందులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బియ్యం పౌష్టికత ప్రభావం, దీని వల్లతలెత్తే ఇతరత్రా అనారోగ్య సమస్యలపై తేల్చుకునేందుకు చేపట్టిన పలు పైలెట్ ప్రాజెక్టు నివేదికలను మోడీ ప్రభుత్వం పక్కకు పెట్టినట్లు వెల్లడైంది. ఆర్థిక సమస్యల గురించి పక్కన పెడితే తలెత్తే ఆరోగ్య సమస్యలను గ్రహించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ పథకానికి అభ్యంతరం తెలిపినా కేబినెట్ తరఫున మోడీ దీనిని బేఖాతరు చేసినట్లు వెల్లడైంది. ఈ క్రమంలోనే అత్యధిక సంఖ్యలో సంచుల కొద్ది బలవర్థక బియ్యం దేశం నలుమూలాల పంపిణికి ఏర్పాట్లు జరిగాయి. ఇదే దశలో దేశానికి చెందిన అత్యున్నత వైద్య పరిశోధక మండలి (ఐసిఎంఆర్ ) అధినేత కూడా ఈ బియ్యం వల్ల పిల్లలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. అయితే వీటిని మోడీ పెడచెవిన పెట్టారు. దేశంలో 80 కోట్ల మందికి తప్పనిసరిగా ఈ బియ్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. వివిధ సంక్షేమ పథకాల పరిధిలో కేంద్ర ప్రభుత్వం లబ్థిదారులకు పంపిణీ పేరిట 137.74 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించింది.
పిల్లల్లో పౌష్టికాహార లోపాలు, రక్తహీనత నివారణ పేరిట ఈ కార్యక్రమం చేపట్టారు. దేశంలో 1.7 మిలియన్ల పిల్లలు తీవ్రస్థాయి పౌష్టికాహార లోపాలతో ఉన్నట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి. ఐరన్ లోపంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 వంటివాటితో కూడుకునే బలవర్థక బియ్యంతో పోషకాహార లోపాలు నివారించవచ్చునని మోడీ ప్రభుత్వం పేర్కొంటూ వచ్చింది. బలవర్థక బియ్యం పేరిట బియ్యంలోకి కృత్రిమ పోషకాలను పంపించడం వల రూపొందించే బలవర్థక బియ్యం లేదా గోధుమలు లేదా నూనెల శాశ్వత పరిష్కార మార్గాలు కావని, వీటి వల్ల ఇతరత్రా అనర్థాలు తలెత్తుతాయని నిపుణులు పదేపదే హెచ్చరిస్తూ వస్తున్నారు. పిల్లల్లో తగు రీతిలో పౌష్టికతను పెంచేందుకు వారికి వివిధ రకాల ఆహారాలు, అందించాల్సి ఉంటుంది.
ఇటువంటి ఆహారం ప్రజలకు అందుబాటు ధరలలో దక్కాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అయితే పలు రకాల ఆహారధాన్యాల పంపిణీతో తలెత్తే భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం క్రమేపీ పేదలకు ఆహారధాన్యాల పంపిణీని మూసపద్థతికి తీసుకువచ్చింది. ఒకే రకం ధాన్యం అందించే విధానాన్ని పాటించింది. ఇప్పుడు మరో అడుగు గెంతేసి బలవర్థక ఆహారం పేరిట ప్రజల ఆరోగ్యం బలోపేతం చేస్తామని కృత్రిమ పద్థతులకు దిగింది. ఇప్పటికీ కూడా ఈ బలవర్థకబియ్యం పట్ల శాస్త్రీయంగా ఎటువంటి రీతిలో కూడా ఆమోదం తెలియచేయలేదు. కృత్రిమతను బలవర్థకం అని తద్వారా పౌష్టికతకు దారితీస్తుందని అనలేమని పేర్కొంటున్నారు.
బియ్యంతో పిండి, తిరిగి గింజలు వాటిలోపోషకాలు
బియ్యాన్ని దంచి వాటిపిండిగా చేసి , ఆ తరువాత వాటిలో పోషకాలను కృత్రిమంగా దట్టించి తిరిగి వాటిని యంత్రాల ద్వారా బియ్యపు గింజలుగా చేయడం ద్వారా ఈ ఫోర్టిఫైడ్ రైస్‌ను రూపొందిస్తారు. బియ్యాన్ని పోలి ఉండే ఈ బియ్యంలో సాధారణ బియ్యం కూడా కలుపుతారు. అయితే ఈ విధంగా రూపొందే బలవర్థకపు బియ్యం వల్ల రక్తహీనత తగ్గుతుందని భావించడం తప్పని, విడ్డూరమే అని పరీక్షల క్రమంలో తేలింది. 2019 ఫిబ్రవరిలో పైలెట్ పథకం పరిధిలో ప్రభుత్వం ఈ దిశలో పరీక్షలు చేపట్టింది. పలు పైలెట్ ప్రాజెక్టుల ఫలితాలను గురించి పట్టించుకోకుండానే విశ్లేషించుకోకుండానే, కనీసం ఇవి పూర్తి అయ్యే వరకూ ఆగకుండానే , 2022 మార్చిలో వీటిపై ప్రయోగాలు పూర్తి అవుతాయని తెలిసి ఉండగానే ప్రధాని మోడీ అంతకు ముందు ఒక్క ఏడాది అంటే 2021లోనే ఈ పథకం గురించి అట్టహాసంగా ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు.
ప్రజల ఆరోగ్యం సంబంధిత కీలక విషయంలో, ఓ ప్రధాన విధాన నిర్ణయంలో ప్రత్యేకించి రేపటి తరం ఉనికి సంబంధిత వ్యవహారంలో ప్రధాని వ్యవహరించిన తీరు ఇప్పుడు కేవలం ప్రచార ఆర్బాటం, అశాస్త్రీయపు పేలవ తనాన్ని చాటేలా చేసింది. బలవర్థక బియ్యం సంబంధించి పైలెట్ ప్రాజెక్టులు నిర్వహించేందుకు అంగీకరించిన 15 రాష్ట్రాలలో తొమ్మిది రాష్ట్రాలు తాము ఇంకా ఈ పనిచేపట్టలేదని తెలియచేసిన దశలోనే ప్రధాని ఈ బియ్యం విషయంలో కీలక ప్రకటన చేసేశారని ఇప్పుడు వెల్లడైన పత్రాలతో తేటతెల్లం అయింది. కొన్ని రాష్ట్రాలలో ఈ పథకం పరిధిలో బియ్యం పంపిణీ చేసి దీని వల్ల సరైన ఫలితాలు లేవని పైగా దుష్పలితాలకే ఆస్కారం ఉందని నిర్థారించుకున్నాయి.