Friday, November 22, 2024

రవాణాశాఖకు కాసుల వర్షం

- Advertisement -
- Advertisement -

 పెరిగిన ఖరీదైన వాహనాల కొనుగోళ్లు

 గతేడాది కన్నా ఈసారి రంగారెడ్డిలో 75% అధిక వృద్ధి

 వచ్చే ఆర్థిక సంవత్సరానికి మరో వెయ్యి కోట్ల అదనపు ఆదాయం

హైదరాబాద్: కొత్త వాహనాల కొనుగోళ్ల ద్వారా రవాణా శాఖకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ కొనుగోళ్లకు సంబంధించి అంతకు ముందు ఏడాదితో పోల్చితే రంగారెడ్డిలో ఈసారి ఏకంగా 75 శాతం వృద్ది నమోదైనట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఖరీదైన వాహనాల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త వాహనాల కొనుగోళ్లతో రవాణా శాఖకు పన్నుల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే శివార్లలో ఈ వాహనాల కొనుగోళ్లు ఎక్కువగా ఉండగా, ద్విచక్ర వాహనాలతో పాటు ఖరీదైన కార్ల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

దీంతో జీవిత కాల పన్నుల ద్వారా కూడా రవాణా శాఖకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. 2022,-23 సంవత్సరంలో హైదరాబాద్‌తో పోలిస్తే రంగారెడ్డిలో వాహన కొనుగోళ్లు ఎక్కువగా జరిగినట్లు రవాణా శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో మోటారు వాహనాల సంఖ్య కోటి 51 లక్షలకు చేరుకుంది. వాహనాల పెరుగుదలతో 2022, 23 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు రూ.6391.80 కోట్ల ఆదాయం సమకూరగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి మరో వెయ్యి కోట్ల ఆదాయం అదనంగా వచ్చే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఖరీదైన కార్లు కొనడంపై…
వాహనాల కొనుగోళ్లకు సంబంధించి మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే ఎక్కువగా ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నుంచి మొత్తం రూ.1,523.66 కోట్ల రెవెన్యూ రాగా.. అందులో రూ.1,243.06 కోట్లు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ద్వారా సమకూరినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోగడిచిన ఏడాదిలో రూ.1,323 కోట్ల ఆదాయం రాగా అందులో రూ.1,078 కోట్లు జీవిత కాలం పన్ను రూపంలో సమకూరింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో క్వార్టర్లీ ట్యాక్స్ రూపంలో రూ.111.36 కోట్లు రాగా, లైఫ్‌ట్యాక్స్ రూపంలో రూ.939.13 కోట్లు, ఫీజుల రూపంలో రూ.64.5 కోట్లు, జరిమానా రూపంలో రూ.22.4 కోట్లు, సేవా రుసుం రూపంలో రూ.19.75 కోట్ల రాగా మొత్తం రూ.1,157.14 కోట్ల ఆదాయం వచ్చింది. ముఖ్యంగా రూ.10 లక్షలు ఆపైన ఖరీదైన కార్లు కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

73 శాతం మోటార్ సైకిళ్లు
రాష్ట్రంలో గత నవంబర్ 2022 నాటికి మొత్తం రిజిస్ట్రర్ వాహనాల సంఖ్య 1,51,13,129 నమోదు కాగా, మొత్తం వాహనాల్లో 73 శాతం మోటార్ సైకిళ్లు కాగా, కార్లు, క్యాబ్‌లు మొత్తం వాహనాల్లో 13.6 శాతం వాటా కలిగి ఉన్నాయి. మొత్తం మీద 1.51 కోట్ల వాహనాల్లో 1.11 కోట్లు ద్విచక్ర వాహనాలు, 19.45 లక్షల కార్లు, 6.8 లక్షలు ట్రాక్టర్లు, 5.9 లక్షల గూడ్స్ క్యారేజీలు, 4.48 లక్షల ఆటోలు ఉన్నాయి. ఇక ఈమధ్య కొత్తగా తీసుకున్న వాహనాలు చేరికతో ఈ సంఖ్య మరింత పెరిగిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే 77 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, అందులో 57 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, 13.76 లక్షల కార్లు ఉన్నా యి. తాజా గణాంకాల ప్రకారం 12 సంవత్సరాల వ్యవధిలో, నగరంలో వాహనాల సంఖ్య మూడు రెట్లు పెరగ్గా, ఈ 3 సంవత్సరాల్లో సుమారు 14 లక్షల వాహనాలు అధికంగా పెరిగాయని అధికారులు తెలిపారు.

సగటున రోజుకు 2,300 కొత్త వాహనాలు
2019లో నగరంలో సుమారు 64,02,482 వాహనాలు ఉండగా ఆగస్టు 2022 నాటికి వాహనాలు 77,65,487కు పెరిగాయి. సగటున రోజుకు 2,300 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని రవాణా శాఖ అధికారుల గణాంకాల్లో తేలింది. కొన్నేళ్లుగా తెలంగాణలో కొత్త వాహనాల సంఖ్య, వాటి రిజిస్ట్రేషన్లలో నిరంతర వృద్ధిని నమోదుతోందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News